WorldWonders

మగాళ్లను మ్యాట్రిమోనీల రూపంలో మోసం చేస్తున్నారు భయ్యా!

Grooms are being cheated via matrimonial matches in India

సాధారణంగా మ్యాట్రిమోనీ మోసం అనగానే సైబర్‌ నేరగాళ్లే గుర్తుకు వస్తారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో తమ పేరు నమోదు చేసుకుని యువతులకు గాలమేసే ఘరానా కేటుగాళ్లే స్ఫురిస్తారు. ఈ తరహా మోసాల్లో మగాళ్లూ బాధితులు అవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. అమ్మాయిల పేరిట నకిలీ ప్రొఫైళ్లు సృష్టిస్తున్న కొందరు నేరస్థులు… యువకులను లక్ష్యంగా చేసుకొని వలపు వల విసురుతున్నారు. అమ్మాయిలతో తీయగా మాట్లాడిస్తూ… ముగ్గులోకి దింపి డబ్బు స్వాహాకు పాల్పడుతున్నారు. వెబ్‌సైట్‌లో ప్రొఫైళ్లు నచ్చాయని చెప్పి అత్యవసరం… బహుమతుల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు నాలుగు నమోదయ్యాయి. నార్సింగి హైదర్‌షాకోట్‌ ప్రాంతానికి చెందిన రైతు(70) తన కుమార్తె పెళ్లి కోసం ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ నమోదు చేశాడు. ఆ ప్రొఫైల్‌ చూసి కిరణ్‌ అనే వ్యక్తి ఫోన్‌లో రైతును సంప్రదించాడు. తిరుపతిలో ఉండే తాను చెన్నైలో స్థిరాస్తి వ్యాపారం చేస్తానని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటానన్నాడు. కొన్ని రోజుల తర్వాత కిరణ్‌ తల్లిదండ్రులు ఫోన్‌లో మాట్లాడారు. త్వరలో నిశ్చితార్థం చేసుకుందామని చెప్పారు. ఈ క్రమంలో ఓ రోజు రైతు కుమార్తెకు కిరణ్‌ ఫోన్‌ చేశాడు. తిరుపతిలో ఓ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం అత్యవసరంగా రూ.3.5 లక్షలు అవసరమయ్యాయని చెప్పాడు. సర్దుబాటు చేస్తే ఇచ్చేస్తానని నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన రైతు… కిరణ్‌ సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.3.41 లక్షల్ని బదిలీ చేశాడు. తర్వాత కిరణ్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌ చందౌలికి చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి(58) మియాపూర్‌ మయూరినగర్‌లో స్థిర పడ్డారు. విడాకులు పొందిన తన కుమార్తెకు రెండో సంబంధం కోసం ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేశాడు. అజయ్‌కుమార్‌ పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. అమ్మాయి ప్రొఫైల్‌ నచ్చిందని…పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అమ్మాయికి క్రిస్‌మస్‌ గుర్తుగా రూ.32.5 లక్షల విలువైన బహుమతి పంపుతానన్నాడు. కస్టమ్స్‌ క్లియరెన్స్‌, ఫారెక్స్‌ కరెన్సీ ఛేంజ్‌, ఫారిన్‌ అండ్‌ హోమ్‌ క్లియరెన్స్‌ పేరిట రూ.3.8 లక్షల్ని తాను సూచించే బ్యాంకు ఖాతాలో వేయాలన్నాడు. మోసగాడి మాటలు తీయగా ఉండటంతో విశ్రాంత ఉద్యోగి నిజమేనని నమ్మి ఆ డబ్బు బదిలీ చేశాడు. తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో మోసపోయానని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించాడు. బాచుపల్లి నిజాంపేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి(57) తన తనయుడికి పెళ్లి సంబంధం చూసేందుకు ఓ మ్యాట్రిమోనీలో పేరు నమోదు చేశారు. అందుకు స్పందనగా నారాయణ అనే వ్యక్తి ఫోనులో స్పందించాడు. ‘మా కుమార్తె కోసం సంబంధం వెతుకుతున్న క్రమంలో మీ అబ్బాయి ప్రొఫైల్‌ చూశా’నన్నారు. ఆ ఉద్యోగి తనయుడి చరవాణి నంబరు తీసుకున్నాడు. మరుసటి రోజు ఓ అమ్మాయి ఆ యువకుడికి ఫోన్‌ చేసింది. తాను అమెరికాలో పని చేస్తున్నానని, హెచ్‌1బీ వీసా స్టాంపింగ్‌ కోసం చెన్నై వచ్చానని తెలిపింది. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి తల్లి ఫోన్‌ చేసి సంబంధం మాకు నచ్చిందని వెల్లడించింది. ఆ అమ్మాయి.. అబ్బాయితో తీయటి మాటలతో వాట్సప్‌లో సంభాషణలు కొనసాగించింది. త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పింది. నిశ్చితార్థం కోసం చీర కొనాలంది. ఉంగరాన్ని మాత్రం తాము తరచూ బంగారు నగలు చేయించే వ్యక్తి దగ్గరే చేయించాలని డిమాండ్‌ చేసింది. అమ్మాయి నచ్చడంతో అబ్బాయి అంగీకరించాడు. ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.1.5 లక్షల్ని బదిలీ చేశాడు. గత నెల 15న పెళ్లి విషయం మాట్లాడేందుకు చెన్నై రావాలని ఆహ్వానించారు. తాము వస్తున్నామని ఉద్యోగి సమాచారం ఇచ్చిన వెంటనే కొద్దిసేపటికి అమ్మాయి ఫోన్‌ చేసింది. అమ్మమ్మ అకస్మాత్తుగా అనారోగ్యం పాలైందని వాపోయింది. మరోసారి రావాలని కోరింది. ఆ తర్వాత నుంచి అమ్మాయి, ఆమె తల్లి, తండ్రి చరవాణులు స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. తర్వాత ఆ అమ్మాయి ‘యూ హావ్‌ బీన్‌ ఫూల్‌డ్‌’ అంటూ సంక్షిప్త సందేశం పంపించి తన డీపీ చిత్రాన్ని మార్చేసింది. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్‌ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు(26) పెళ్లి సంబంధం కోసం ఓ పేరున్న మ్యాట్రిమోనీ.కామ్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. తర్వాత అతడికి విదేశీ నంబరుతో వాట్సప్‌ సందేశం వచ్చింది. అవతలి నుంచి చాట్‌ చేసిన అమ్మాయి తన పేరు డాక్టర్‌ అనికా అమోలి అలెన్‌ అని… జర్మనీలో వైద్యురాలిగా పని చేస్తున్నానని పేర్కొంది. పెళ్లి విషయం మాట్లాడేందుకు బెర్లిన్‌ నుంచి లండన్‌ మీదుగా దిల్లీకి వస్తున్నానని పేర్కొంటూ విమాన టికెట్లను వాట్సప్‌లో షేర్‌ చేసింది. సరిగ్గా ఆమె వస్తానని చెప్పిన రోజే శ్వేత బెకాట్‌ పేరుతో బాధితుడికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తనను తాను దిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారిణిగా పరిచయం చేసుకుంది. రూ.లక్ష నగదుతోపాటు 80 వేల యూరోలను వెంట తెచ్చినందుకు అలెన్‌ను తాము విమానాశ్రయంలో పట్టుకున్నామని వెల్లడించింది. ఆమెను వదిలి పెట్టాలంటే రూ.91,400 జరిమానా చెల్లించాలంటూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఖాతా నంబరు చెప్పింది. అలా రకరకాల పన్నుల పేరుతో రూ.3.07 లక్షల్ని కాజేసింది. తర్వాత ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ అయ్యాయి.