చీర ఎలాంటి వారికైనా చక్కగా నప్పుతుంది. అయితే దాన్ని కట్టుకునే తీరులో కొన్ని మార్పులు చేసుకుంటే సన్నగా, నాజూగ్గా కనిపించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో మనమూ తెలుసుకుందామా!
* కుచ్చిళ్లను ఓ క్రమపద్ధతిలో పెట్టుకోవడం వల్ల చీర బాగా కుదురుతుంది. ఎక్కువ కుచ్చిళ్లు పెట్టుకుంటే పొట్ట దగ్గర చాలా ఎత్తుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు అవన్నీ ఒక్కచోటే వచ్చేలా కాకుండా కాస్త పక్కకీ పరచండి.
* పొడుగ్గా, సన్నగా కనిపించాలంటే చీరను వదులుగా కాకుండా శరీరానికి అతుక్కున్నట్లుగా కట్టుకోవాలి. అందుకోసం జార్జెట్, క్రేప్, శాటిన్, షిఫాన్ లాంటి తేలికగా ఉండే వస్త్రరకాల్ని ఎంచుకోవాలి. ఇవి సన్నగా కనిపించేలా చేస్తాయి.
* స్లిమ్‌ఫిట్ పెట్టీకోట్‌ని చీరకు జతగా ఎంచుకోవాలి. చీర కట్టే విధానం, కట్టుకున్న తరువాత మీరెలా కనిపిస్తారేనేది పూర్తిగా దీనిమీదే ఆధారపడి ఉంటుంది. అది మడమల వరకు ఉండేలా ఎంచుకోవాలి. ఇప్పుడు పెట్టీకోట్‌లకు బదులుగా ప్యాంట్‌లనూ ఎంచుకుంటున్నారు. ఇలాంటివారు ఎలాస్టిక్ రకాల్ని కాకుండా బటన్స్, నాడాలు ఉండేవి ఎంచుకుంటే కావలసినంత బిగుతుగా చేసుకోవచ్చు. జీన్స్‌ని కూడా వాడొచ్చు.
* పొడవాటి చేతులున్న బ్లవుజు వేసుకున్నా సన్నగా కనిపిస్తారు. భుజాలు లావుగా ఉన్నవారు వీటిని ఎంచుకోవడం వల్ల ఆ లోపాన్ని కనిపించకుండా చేయొచ్చు.
* స్లీవ్‌లెస్, హాల్టర్ నెక్, ఆఫ్ షోల్డర్డ్, కేప్ బ్లవుజులను ప్రత్యేక సందర్భాల్లోనే ఎంచుకోవాలి. ఇవి మీ శరీర పై భాగాన్ని పెద్దగా కనిపించేలా చేస్తాయి. రఫుల్స్ చేతి అంచుల్లో కుట్టించుకుంటే దృష్టివాటిమీదకు వెళ్లి సన్నగా కనిపిస్తారు.
* కాస్త బొద్దుగా ఉన్నవారు లేత రంగుల్లో, తక్కువ డిజైను ఉన్న చీరల్ని ఎంపిక చేసుకోవాలి. పెద్ద ప్రింట్లు మీ వయసు కంటే పెద్దవారిలా చూపిస్తాయి. అదే చిన్న ప్రింట్లు, సన్నటి అంచు మిమ్మల్ని సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేస్తాయి.