Business

₹10లక్షలకు మించి విత్‌డ్రా చేస్తే పన్నులతో వాయిస్తారు

Indian government to charge extra tax if you withdraw more than 10lakhs

నల్లధనాన్ని అరికట్టడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏడాదిలో రూ. 10లక్షల కంటే ఎక్కువ విత్‌ డ్రా చేసే వారిపై త్వరలో పన్నులు విధించనుంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతేగాక.. ఎక్కువ మొత్తంలో నగదు విత్‌ డ్రా చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలో ఉంది. దీనిపై సమగ్ర పరిశీలన జరిపి త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. అయితే పేద, మధ్య తరగతి వర్గాలకు భారం కాకుండా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందట. ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్‌ బ్యాంకు లావాదేవీలకు ఛార్జీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డిజిటల్‌ లావాదేవీలను పెంచేందుకు ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది. కాగా.. దశాబ్దం క్రితం యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఓ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో నగదు లావాదేవీలపై పన్నులు ప్రవేశపెట్టింది. అయితే దానిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కొన్నేళ్ల తర్వాత ఆ పన్నులను ఎత్తివేసింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సయమంలో నగదు విత్‌ డ్రాలపై పన్నులు తీసుకురావాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఆ ప్రతిపాదనలు ఆమోదం పొందలేదు.