ఓ బీదవానికి తన శేష జీవితాన్ని భగవత్సేవలో గడపాలన్న కోరిక కలిగి, ఒక మునిని ఆశ్రయించాడు. అతని కోరికలోని నిజాయితీని గుర్తించిన ఆ ముని అతనికి “మంత్రోపదేశం” చేసి, సముద్రపు ఒడ్డున ధ్యానం చేయమని చెప్పాడు…
ఆ బీదవాడు అలానే చేసాడు. సముద్రుడు ప్రత్యక్షమై, ఓ వరం కోరుకోమన్నాడు.
“స్వామీ… బీదవాడిని… భగవత్సేవలో శేష జీవితాన్ని గడపాలనుకొంటున్నాను… కానీ, గృహస్థాశ్రమంలో కుటుంబ పోషణ, ధన సంపాదన తప్పనిసరి గదా… నాకో మార్గాన్ని చూపండి…” అడిగాడు.
సముద్రుడు ఓ శంఖాన్నిచ్చి, దాన్ని రోజూ క్రమం తప్పక పూజ చేస్తే, అది ప్రతి రోజూ అణా లేదా కానీ ఎత్తు బంగారం ఇస్తుందని చెప్పాడు…
ఆ బీదవాడు ఆనందంగా ఇంటికి వెళ్తుండగా, ఒక మనిషి ఎదురై, “ఎక్కడ నుండి వస్తున్నా”రని అడిగాడు. అమాయకుడైన బీదవాడు అసలు విషయం చెప్పేసాడు…
ఆ మనిషొక మోసగాడు… అతనికి ఆ శంఖం దొంగిలించాలనిపించింది. “ఈ రాత్రి మా యింట్లో విశ్రమించి, రేపు ఉదయాన్నే వెళ్లండి…” అన్నాడు. ఆ రాత్రి బీదవాడు భోజనం చేసి, విశ్రమించిన సమయంలో ఆ మోసగాడు బీదవాని సంచిలోని శంఖాన్ని కాజేశాడు…
ఇంటికి వెళ్ళిన ఆ బీదవాడు తన సంచీలో శంఖం లేకపోవడం చూసి, తిరిగి సముద్రుని వద్దకు వెళ్లి, విషయం విన్నవించుకున్నాడు. సముద్రుడు ఇంకొక శంఖమిచ్చి, “ఇది లక్ష తులాలు లేదా అంతకంటే ఎక్కువ బంగారం ఇస్తానని చెప్తూ ఉంటుంది. ఇంటికి వెళ్తూ, ఈ రాత్రి కూడా వాని ఇంట్లోనే విశ్రమించు” అని సూచించాడు.
బీదవాడు మోసగాని ఇంటికి పోయి, తన శంఖం పోయిన విషయం సముద్రునితో చెప్పగా, అంతకంటే శక్తి మంతమైన శంఖం ఇచ్చాడని చెప్పి నిద్రించాడు. మోసగాడు ఆ శంఖం కోసం ఆశపడి, శంఖాలను మార్చివేసాడు.
మరునాటి ఉదయం బీదవాడు తన ఇంటికి వెళ్లి, సంచీ నుండి శంఖం తీసి, క్రమం తప్పక ప్రతీ రోజు పూజ చేస్తూ,అది ఇచ్చే బంగారంతో కుటుంబం గడుపుకొంటూ భగవత్సేవకు, సమాజ సేవకూ అంకితమయ్యాడు…
మర్నాటి ఉదయం మోసగాడు శంఖానికి పూజ చేసి, బంగారం ఇమ్మన్నాడు. వెంటనే, “ఇదిగో లక్ష తులాల బంగారం తీసుకో…” అంది ఆ పెద్ద శంఖం…
“ఏదీ బంగారం..? ఎక్కడ..?కనబడటం లేదే..?”
“అలాగా… అయితే ఈ లక్షన్నర తులాల బంగారం తీసుకో…”, మరలా అంది శంఖం…
“కనబడడం లేదే… బంగారం ఎక్కడ..?”, తిరిగి అడిగాడు మోసగాడు…
అతడు అలా అడిగే కొద్దీ, శంఖం తన పరిమాణం పెంచుతూ పోయింది…
అడిగి, అడిగి అలసిపోయిన అతనితో ఆ పెద్ద శంఖం ఇలా చెప్పింది…
“శంఖలీ కాంచనం దద్యాత్
అహం శంఖం లపోడకః
వదామి బహు వాక్యాని
న దదామి కపర్ణికామ్”
చిన్న శంఖం బంగారమిస్తుంది. నేను లపోడశంఖాన్ని. మాటలు చెప్పటమే నా వంతు…
?ఈ కథ వల్ల మనకు తెలిసేదేమంటే తులం బంగారమిచ్చే శంఖం లక్షల తులాల బంగారం ఇస్తాను, ఇస్తాను అనే శంఖం కంటే చాలా మేలు…
అదే విధంగా, వాగ్దానాల ఆధారంగా మనుషులను “నమ్మటం” కాక, గతంలో వారు చేసి చూపించిన పనిని బట్టి “అంచనా” వేయాలి…
శ్రీమతి పాలంకి సత్య గారు – జాగృతి (2013)