ఏపీ సీఎం జగన్ మంత్రివర్గ కూర్పు విశాఖ జిల్లా వైసీపీ నేతలను తీవ్ర నిరాశ కలిగించింది. 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను అందించిన విశాఖ జిల్లాకు ఒక్క మంత్రి పదవి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇద్దరు లేదా ముగ్గురు మంత్రి పదవులు పొందిన విశాఖకు ప్రధాన్యత ఇవ్వకపోవడంపై వైసీపీ నేతలు విస్మయం చెందుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలా నెట్టుకురావాలా అని వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైంది.ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక కూడా విశాఖ ఆర్థిక రాజధానిగా వర్ధిల్లుతోంది. నగర, గ్రామీణ, ఏజెన్సీ మూడు ప్రాంతాల్లో విస్తరించిన విశాఖ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. జగన్ టీం లోనూ విశాఖకు అంతటి ప్రాధాన్యత ఉంటుందని భావించారు. విశాఖ నగరం నుంచి ఒకరికి, జిల్లాలో మిగిలిన ప్రాంతం నుంచి మరొకరికి పదవులొస్తాయని వైసీపీ నేతలు భావించారు. జిల్లా మొత్తం నుంచి ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. GVMC పరిధిలో ఉన్న అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్ నాథ్ లలో ఒక్కరికి మంత్రి పదవి వస్తుందని భావించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిలో అవంతికే బెర్త్ దక్కింది.గ్రామీణ విశాఖలో వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడుకి గాని, ఎస్సీ వర్గానికి చెందిన గొల్ల బాబురావుకి గాని పదవి ఇస్తారని భావించారు. కానీ ఇద్దరిలో ఎవరికీ మంత్రి బెర్త్ దక్కలేదు. టీడీపీ ఆకర్ష్ కు లొంగకుండా ఉన్న బూడికి విప్ పదవి ఇచ్చారు. గత ప్రభుత్వంలో సిటీ నుంచి గంటాశ్రీనివాసరావు, జిల్లాకి చెందిన అయ్యన్న పాత్రుడుకి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ప్రత్యేక కారణంతో కిడారి శ్రావణ్ కుమార్ కు కూడా మంత్రి పదవి దక్కింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు కార్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి సవాల్ గా మారాయి. కేవలం ఒక్క మంత్రి పదవే జిల్లాకు దక్కడంతో.. ఎలా బాలెన్స్ చేస్తారోనని ఆ పార్టీ నేతల్లో ఆసక్తినెలకొంది.
విశాఖ వైకాపాలో అసంతృప్తి
Related tags :