*ఎన్నారై కోటాలో అదే సీటు రూ. 34 లక్షలు
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలిసారిగా ప్రభుత్వ వ్యవసాయ కాలేజీల్లో పేమెంట్ సీట్లను ప్రవేశపెట్టింది. వ్యవసాయ డిగ్రీ (ఏజీ బీఎస్సీ) కోర్సులో సాధారణ కోటా పేమెంటు సీటు పొందాలంటే మొత్తం రూ. 14 లక్షల రుసుం చెల్లించాలని నిర్ణయించింది. ఏటా రూ. 3.50 లక్షల చొప్పున నాలుగేళ్ల పాటు దీనిని వసూలు చేస్తారు. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే వీటిని భర్తీచేస్తారు. ఇక ఇదే సీటు ఎన్నారై కోటాలో చేరాలంటే నాలుగేళ్లలో మొత్తం రూ. 34 లక్షలు చెల్లించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఎన్నారై కోటాలో చేరాలనుకునే విద్యార్థి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైతే చాలు. ఎంసెట్ కూడా రాయనక్కరలేదు. కానీ ఎన్నారై ఎవరైనా ఈ విద్యార్థి తరఫున 33 వేల అమెరికా డాలర్లు చెల్లిస్తూ స్పాన్సర్ లేఖను ఇవ్వాలి. ఈ 33 వేల డాలర్లు కాకుండా ఏటా రూ. 3.50 లక్షల చొప్పున భారతీయ కరెన్సీలో చెల్లించాలి. ఇవన్నీ కలిపి రూ. 34 లక్షలవుతాయని అంచనా.
*తొలిసారిగా అమ్మకం సీట్లు
ఇతర రాష్ట్రాల్లో ఇదే డిగ్రీ కోర్సు సీట్లకు వసూలు చేస్తున్న రుసుములపై అధ్యయనం చేసి ఇక్కడా పేమెంట్ సీట్లకు రుసుములను నిర్ణయించినట్లు వర్సిటీ స్పష్టం చేసింది. ఉదాహరణకు కర్ణాటకలో సాధారణ కోటా పేమెంట్ సీటుకు రూ.25 లక్షలు వసూలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఏమాత్రం సౌకర్యాలు, బోధకులు లేని ప్రైవేటు వ్యవసాయ కాలేజీల్లో రూ. 15 లక్షల దాకా తీసుకుంటున్నారు. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి లక్షలాది రూపాయలు కట్టి సరైన సౌకర్యాలు లేకున్నా చేరుతున్నందున జయశంకర్ వర్సిటీ ఇక్కడి ప్రభుత్వ కాలేజీల్లో పేమెంట్ విధానాన్ని తెచ్చింది.
*ప్రైవేటుకు అనుమతి లేదు
తెలంగాణలో ప్రైవేటు వ్యవసాయ కాలేజీల ఏర్పాటుకు అనుమతి లేదు. కొన్ని కాలేజీలు ప్రైవేటువని, ఇతర రాష్ట్రాల వర్సిటీల అనుబంధం ఉందని బోగస్ ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను చేర్చుకుని మోసగిస్తున్నాయి. ఇలాంటి కాలేజీల్లో చేరిన విద్యార్థుల డిగ్రీలు చెల్లుబాటు కావని జయశంకర్ వర్సిటీ స్పష్టం చేసింది.
**ఎంసెట్ కోటాలో 432 సీట్లు..
రాష్ట్రంలో మొత్తం ఆరు వ్యవసాయ కాలేజీలున్నాయి. వాటిలో 663 సీట్లు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ కోటా కింద వీటిలో 432 సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. మిగతా వాటిలో ‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’ (ఐసీఏఆర్) నిర్వహించే అఖిల భారత ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా 40, పాలిటెక్నిక్ డిప్లమో ఉత్తీర్ణులైన వారికి మరో 65, వ్యవసాయశాఖలో పనిచేసే ఉద్యోగులకు 22, వర్సిటీ ఉద్యోగులకు 4, సాధారణ పేమెంట్ కోటా కింద 75, ఎన్నారై కోటాలో 25 సీట్లు భర్తీ చేస్తారు. రాజేంద్రనగర్, జగిత్యాల, అశ్వారావుపేట కాలేజీల్లో మాత్రమే పేమెంటు సీట్లు ఉంటాయి. మిగిలిన పాలెం, వరంగల్, సిరిసిల్ల కాలేజీల్లో ఈ కోటా లేవు.
**వచ్చే నెలాఖరులో….
వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు జయశంకర్ వర్సిటీయే సంయుక్త ప్రవేశ ప్రకటన జారీచేస్తుంది. దరఖాస్తులను ఆహ్వానిస్తూ త్వరలో ప్రకటన ఇస్తుంది. కానీ నీట్ ఆధారంగా ఎంబీబీఎస్, దంతవైద్య కోర్సుల సీట్ల భర్తీకి సాధారణ వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ పూర్తయిన తరవాతే వ్యవసాయ కోర్సులకు కౌన్సెలింగ్ ఉంటుంది. నీట్‌లో ర్యాంకులు వచ్చిన వారు వ్యవసాయ ఎంసెట్ సైతం రాస్తారు. టాప్ ర్యాంకర్లు వైద్య కోర్సులకు వెళతారు. వారు వెళ్లిన తరవాత మిగిలిన ర్యాంకర్లకు అవకాశం ఇచ్చేందుకు ఆలస్యంగా వచ్చే నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో వ్యవసాయ కోర్సులకు కౌన్సెలింగ్ ఉంటుంది. పేమెంట్ తప్ప మిగిలిన అన్ని కోటా సీట్లలో 40 శాతం రైతు కుటుంబాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎకరం భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతు కుటుంబంలోని విద్యార్థి ఈ రైతు కోటాకు అర్హులు. వీరు తప్పనిసరిగా పదో తరగతి వరకూ గ్రామ పంచాయతీ పరిధిలోనే చదవి ఉండాలి.
వ్యవసాయం చదవాలంటే ₹34లక్షలు కట్టాలి
Related tags :