చర్చి అనగానే ఏం గుర్తుకొస్తది? ఏసు ప్రభువు ప్రతిమలు, ఆయన చెప్పిన సూక్తులతో కనిపించే గోడలు. కానీ ఈ చర్చి మాత్రం అలా కాదు. ఎటు చూసినా మనుషుల అస్థిపంజరాలే కనబడుతుంటయ్. గోడలు, పిల్లర్లు, ఫ్లవర్‌వాజ్‌లు, క్యాండిల్ స్టాండ్లు.. ఒక్కటేమిటి డెకరేషన్ కూడా పుర్రెలు, ఎముకలతోనే. అలాగని చర్చి భయంకరంగా ఉంటదా అంటే అస్సలు కాదు. జబర్దస్త్గుంటది. పుర్రెల డిజైన్లు కళ్లను కట్టిపడేస్తుంటయ్. ప్రశాంతత కోసం మస్తు మంది ఇక్కడికి వస్తుంటరు. మరి ఈ చర్చి ఎక్కడుంది? ఎందుకలా కట్టారంటారు?
**చెక్ రాజధానికి దగ్గర్లో
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌కు తూర్పున 70 కిలోమీటర్ల దూరంలో సెడ్లాక్ సిటీ ఉంది. 13 నుంచి 16వ శతాబ్దం వరకు సెడ్లాక్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే మంచి పేరున్న సిటీ. రాజకీయంగా, ఆర్థికంగా, వాణిజ్యపరంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందింది. అప్పట్లో సిల్వర్ మైన్ బూమ్ అక్కడ ఓ రేంజ్లో నడిచింది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నాటి చెక్ అందాలు కనిపిస్తుంటాయి. అలా అలా నగరం వీధుల్లో నడుచుకుంటూ వెళ్తే ఓ చిన్న చర్చి కనిపిస్తుంది. దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చర్చినే ముద్దుగా ‘బోన్ చర్చి’, ‘టెర్రిఫిక్ చర్చి’ అని పిలుస్తుంటారు. సుమారు 40 వేల అస్థిపంజరాలతో అలంకరించారీ చర్చిని.
**13వ శతాబ్దంలో మొదలు
ఈ చర్చి వెనకో కథ ఉంది. 1278వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పాలించిన బొహెమియా రాజు ఓ వ్యక్తిని జెరుసలెం పంపాడు. అక్కడ ఏసును శిలువ వేసిన ప్రాంతం నుంచి ఓ జార్లో మట్టిని తీసుకురమన్నాడు. ఆ మట్టిని నగరంలోని శ్మశానవాటికలో చల్లించాడు. విషయం తెలుసుకున్న చాలా మంది అక్కడ ఖననం చేసేందుకు రాజు అనుమతి తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఆ స్థలం శ్మశాన వాటికయింది. స్థానికులూ అక్కడే శవాలను పాతిపెట్టడం మొదలుపెట్టారు. 14వ శతాబ్దం వరకు ఆ సంప్రదాయం కొనసాగింది.
**1870లో డిజైన్
14వ శతాబ్దంలో యూరోప్ అంతా ప్లేగు వ్యాధి వ్యాపించింది. దాని వల్ల 30 వేల మంది చనిపోయారు. చాలా మందిని చర్చి ఉన్న ప్రాంతంలోనే పూడ్చారు. తర్వాత మతయుద్ధాల వల్ల సెడ్లాక్లో మరో 10 వేల మంది చనిపోయారు. వాళ్లనూ ఇక్కడే పాతిపెట్టారు. 15వ శతాబ్దంలో నగర విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాన్ని తవ్వారు. భారీగా అస్థిపంజరాలు బయటపడ్డాయి. తర్వాత అక్కడో చర్చి కట్టారు. కానీ బయటపడిన అస్థిపంజరాలను1870 వరకు ఎవరూ ముట్టుకోలేదు. తర్వాత స్థానిక శిల్పితో ఓ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆయన తన కళాత్మకతతో చర్చికి ఎముకలతో అందాన్ని తీసుకొచ్చారు. ఆ చిన్న చర్చిలో ఉన్న రకరకాల రూపాల్లోని ఎముకల ఆకారాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
**2018లో 4.5 లక్షల మంది
చర్చిలోని పుర్రెల దండలు సందర్శకులకు వెల్ కమ్ చెబుతుంటా యి. వెన్నుపూసలతో చేసిన షాండ్లియర్ చర్చికే అట్రాక్షన్. చర్చి మధ్యలో అనేక ఎముకలతో అద్భుతమైన ఆకారం వచ్చేలా డిజైన్ చేశారు . అందుకు చేతులు, పుర్రె ఎముక ల ను వాడారు. బైబిల్ లో వర్ణించిన ఏడు తలల రాక్షసుడిలా ఉంటుందా ఆకారం. పారిస్ కాటాకోంబ్స్ తరువాత అతిపెద్ద సంఖ్యలో మనుషుల ఎముకలున్న నిర్మాణంగా ఈ చర్చికి పేరుం ది. ఏటా దాదాపు రెండున్నర లక్షల మందికి తగ్గకుండా చర్చిని సందర్శిస్తుంటారు . 2018లో నాలుగున్నర లక్షల మంది వచ్చారు . ఈసారి నంబర్ ఐదు లక్షలు దాటుతుందని అనుకుం టున్నారు . వీలు చూసుకుని వెళ్లండే!
పుర్రెలతో అలంకరించిన చర్చి చూశారా?
Related tags :