Editorials

హార్లీ డేవిడ్‌సన్‌పై ఎందుకు అంత సుంకం?

Trump questions why India puts a huge import tax on Harley Davidson Bikes

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీకి రెండు వారాల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. హార్లీ డేవిడ్‌సన్‌ మోటారు బైకులపై భారత్‌ భారీగా దిగుమతి సుంకాలను విధించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ నెల 28-29 తేదీల్లో జపాన్‌లోని ఒసాకాలో జరిగే జి20 సదస్సులో మోదీతో భేటీ కానున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక బంధాలన్నింటినీ ఆర్థిక కోణంలో చూసే ట్రంప్‌ భారత్‌ను ‘సుంకాల రాజు’గా అభివర్ణించారు. ప్రతిచర్యగా భారత ఉత్పత్తులపై కూడా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. సోమవారం ఆయన ఓ ప్రసార మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నాకు మంచి మిత్రుడైన మోదీ చేసిన పని చూడండి. హార్లీ బైకులను భారత్‌కు పంపినప్పుడు అక్కడ 100 శాతం పన్ను విధిస్తున్నారు. భారత్‌ నుంచి అమెరికాకు వచ్చే బైకులపై మాత్రం ఎలాంటి పన్ను ఉండటం లేదు. నేను ఫోన్‌ చేసి మాట్లాడడంతో మోదీ ఆ సుంకాన్ని 50 శాతం మేర తగ్గించారు. అయినా అది కూడా ఆమోదయోగ్యం కాదు.’’ అని అన్నారు. అందరూ దోచుకునే ఒక బ్యాంకులా అమెరికా మారిందన్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో ఈ నెల 24న భారత్‌ సందర్శించనున్నారు. భారత్‌తో తమకున్న అత్యంత ముఖ్యమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడం దీని ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, పారదర్శక పరిస్థితులను నెలకొల్పాలన్న ట్రంప్‌ లక్ష్యంలో భారత్‌కు గణనీయ పాత్ర ఉందని చెప్పారు.