Sports

దాయాదుల పోరు జరిగేనా?

India Pakistan Cricket Match In 2019 World Cup Is Doubtful Due To Rain

ఎవరూ పిలవకుండానే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు వరుణుడు అతిథిలా వచ్చేస్తున్నాడు. కసిగా పోరాడుతున్న జట్లకు పదేపదే ఆటంకం కలిగిస్తూ వారిలో అసహనాన్ని పెంచుతున్నాడు. ఫలితంగా టాస్‌ పడకుండానే వరుసగా మ్యాచ్‌లు రద్దవుతున్నాయి. ఇప్పటికే వరుణుడి ధాటికి మూడు మ్యాచ్‌లు రద్దు కాగా, తాజాగా భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కూడా తుడిచిపెట్టుకుపోయింది. టోర్నీలో తొలి ఆరు మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలిగించని వానదేవుడు తర్వాతి నుంచి నిదానంగా జోరు కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో వరుణుడు ఆటంకం కలిగిస్తుంటే దాని ప్రభావం సెమీస్‌ ఫలితంపై పడే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ క్రికెట్‌ అభిమానులు వరుణుడి తీరుపై భిన్న రీతుల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇంగ్లాండ్‌లో వరల్డ్‌కప్‌ నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయం సరైనది కాదని మండిపడుతున్నారు.