WorldWonders

హైదరాబాద్‌లో హెవీ హవాలా

Lot Of Hawala Cash Seized By Hyderabad Police

హైదరాబాద్ రాజధాని నగరంలో గుట్టుగా చేతులు మారుతున్న రూ.1.01 కోట్ల హవాలా సొమ్మును హైదరాబాద్‌ మధ్య మండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. సోమాజిగూడ రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని పద్మజా ల్యాండ్‌మార్క్‌ వద్ద హవాలా లావాదేవీలు జరుగుతున్నాయన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ బృందం అక్కడ నిఘా ఉంచింది. ద్విచక్ర వాహనాలపై సొమ్మును తరలించేందుకు యత్నిస్తున్న జితేందర్‌ నాథ్‌, సురేష్‌ వర్మ, జీఎల్‌ హేమ సుందరం, బండి బాలకృష్ణలను అదుపులోకి తీసుకుంది. ‘‘సదరు సొమ్మును కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఆర్‌ అసోసియేట్స్‌ ప్రతినిధులకు అందించేందుకు తీసుకెళ్తున్నట్టు నిందితులు విచారణలో వెల్లడించారని’’ టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావు తెలిపారు. ‘‘దిల్లీ కేంద్రంగా హవాలా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చేతన్‌ నాథ్‌ సూచన మేరకు హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన సోదరుడు, హవాలా ఏజెంట్‌ జితేందర్‌ నాథ్‌ ఆ సొమ్మును సమకూర్చాడు. తన సహాయకుడు సురేష్‌ వర్మ ద్వారా నగదును సీఆర్‌ అసోసియేట్స్‌ అకౌంటెంట్‌ జీఎల్‌ హేమసుందరం, సీఆర్‌ అసోసియేట్స్‌ ఎండీ చరణ్‌తేజ్‌ నాయుడి అకౌంట్స్‌ అసిస్టెంట్‌ బండి బాలకృష్ణలకు అందజేసేందుకు ఖైరతాబాద్‌కు వచ్చాడు. హేమ సుందరం, బండి బాలకృష్ణలు నగదు తీసుకుంటుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు’’ అని రాధాకిషన్‌రావు వెల్లడించారు. సొమ్ముకు సంబంధించిన పత్రాలు వారి వద్ద లేకపోవడంతో నగదుతోపాటు నలుగుర్నీ ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించినట్టు చెప్పారు. సీఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీ కడప జిల్లాలో విద్యుత్తు ప్రాజెక్టు పనులు చేస్తోందని, కూలీలకు డబ్బు ఇచ్చేందుకుగానూ రూ.1.01 కోట్లు తీసుకురావాలంటూ సంస్థ యజమానులు పురమాయించిన మీదట తాము హైదరాబాద్‌కు వచ్చినట్టు అకౌంటెంట్‌ జీఎల్‌ హేమసుందరం పోలీసులకు వివరించినట్టు తెలిసింది. కూలీల కోసమైతే కంపెనీ అధికారికంగా పేర్కొంటుంది కదా? అని పోలీసులు ప్రశ్నించగా వారు సమాధానం చెప్పలేదని సమాచారం. ‘‘విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్న సంస్థ ఓ రాజ్యసభ సభ్యుడిదని, అధికారికంగా నగదు తీసుకెళ్తే ఇబ్బందులొస్తాయన్న భావనతో హవాలా ఏజెంట్ల ద్వారా సమకూర్చుకుంటున్నామని’’ సదరు రాజ్యసభ సభ్యుని ప్రధాన అనుచరుడు తమకు చెప్పినట్టు నిందితులు పోలీసులకు తెలిపారని విశ్వసనీయంగా తెలిసింది.