*** 60 ఏళ్ల వేడుక – కేఎంసీ వజ్రోత్సవాలకు వేళాయె..! – జులై 20, 21 తేదీల్లో సంబురాలు
వైద్యుల కర్మాగారంగా వినుతికెక్కిన వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) వజ్రోత్సవాలకు సిద్ధమవుతోంది. ఓరుగల్లుకు మణిహారంగా పేరొందిన కళాశాల ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ అరుదైన సందర్భం ప్రతి మదిలో చిరస్థాయిగా నిలిచేలా వేడుకను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాల నుంచి ఏటా 200 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పట్టాలు అందుకుని తమ పేర్ల ముందు డాక్టర్ అని సగర్వంగా తగిలించుకుంటున్నారు. కళాశాలలో చదివిన ఎందరో విద్యార్థులు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు.
**ఇదీ కేఎంసీ చరిత్ర..
1959లో వరంగల్ రీజియన్ మెడికల్ ఎడ్యుకేషన్ సోసైటీ (ఆర్‌ఎంఈఎస్) ద్వారా కేఎంసీ ఆవిర్భవించింది. జులై 23న అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కర్మాకర్ వైద్య కళాశాలను ప్రారంభించారు. వడే్డెపల్లిలోని పింగిళి కుటుంబ సభ్యులు ఇచ్చిన భవనంలో అప్పట్లో తరగతులు నిర్వహించేవారు. ఆ తర్వాత కాలంలో ప్రస్తుతం కళాశాల ఉన్న ప్రాంతానికి తరలించారు. 152.17 ఎకరాల సువిశాల స్థలాన్ని ప్రభుత్వం కళాశాల కోసం కేటాయించింది. రూ.47 లక్షలతో నూతన శాశ్వత భవనాల్ని నిర్మించారు. 1966లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కళాశాల అభివృద్ధి శరవేగంగా సాగింది. మెడికోలకు వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. తాత్కాలికంగా రూ.10.70 లక్షలతో షెడ్డులు నిర్మించారు. కొంతకాలానికి వాటిని ఆధునికీకరించి పురుషుల వసతిగృహంగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ రీజినల్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జె.చొక్కారావు హయంలో 1970లో మహిళలకు శాశ్వత వసతిగృహాన్ని నిర్మించి ప్రారంభించారు. కళాశాల వెనుక ప్రాంతంలో ఓపెన్ ఆడిటోరియాన్ని రూ.4 లక్షలతో నిర్మించారు. కళాశాల ప్రాంగణంలో సిబ్బంది నివాసం కోసం హౌసింగ్ బోర్డు వారు క్వార్టర్లను నిర్మించారు.
**దేశ విదేశాల్లో మనవారే..
కేఎంసీలో వైద్య విద్యను అభ్యసించినవారిలో ఎంతోమంది దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వైద్యుల జాబితాలో కేఎంసీ విద్యార్థుల పేర్లు ముందు వరుసలో ఉన్నాయని ఇక్కడి వైద్య విద్యా బోధకులు చెబుతున్నారు. ఆమెరికాలో స్థిరపడిన డాక్టర్ మోహన్‌రెడ్డి కార్డియోథోరాసిక్ సర్జన్‌గా గుర్తింపు పొందారు. డాక్టర్ లక్కిరెడ్డి భారీ విరాళాన్ని కేఎంసీకి అందించారు. మెడికోల వసతిగృహాల నిర్మాణానికి సహకరించారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి డైరక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు కేఎంసీ పూర్వ విద్యార్థే. హైదరాబాద్, పలు ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో హృద్రోగ నిపుణులు, నెఫ్రాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్ట్‌లు, న్యూరోఫిజిషియన్లు, న్యూరోసర్జన్లు, యూరాలజిస్ట్‌లుగా పలువురు సేవలందిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి నిపుణులుగా పేరొందిన డాక్టర్ మధుసూదన్ కేఎంసీ 1988 బ్యాచ్ విద్యార్థి. పూర్తి సేవాభావంతో పనిచేసే ఆయన ఎంతో మందికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారనే పేరుంది. రాజకీయ రంగంలో కొనసాగుతున్న మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు వరంగల్‌లోనే వైద్య విద్యనభ్యసించారు. శైలేందర్‌సింగ్, శ్రీధర్ కస్తూరి, మల్లెల వెంకటేశ్వర్‌రావు, డాక్టర్ జీఎస్.రావు, వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన డాక్టర్ రమేష్‌రెడ్డి ఇలా ఎంతో మంది ఉన్నతస్థాయిలో పేరుతెచ్చుకున్నారు.
**ఏడాదంతా వివిధ కార్యక్రమాలు..
వజ్రోత్సవాల సందర్భంగా ఏడాది కాలం పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని భావించిన కళాశాల యంత్రాంగం పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిరంతర వైద్య విద్యా (సీఎంఈ) సదస్సులను చేపట్టారు. హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికుల కోసం ఏర్పాటుచేశారు. సీకేఎం ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థుల కోసం సాధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఎంజీఎం, కేఎంసీలో పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేకంగా టీబీ ఆసుపత్రిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. టీబీ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేశారు. గత ఏడాది డిసెంబర్‌లో పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం 8 రోజుల పాటు వైద్య విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు దీన్ని తిలకించారు. శరీర దానం, అవయవదానంపై ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. భ్రూణ హత్యల నివారణ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతలపై ప్రజలకు చైతన్యం కల్పించే కార్యక్రమాల్ని చేపట్టారు. మెగా రక్తదాన శిబిరాన్ని కేఎంసీలో నిర్వహించారు. 250 మంది మెడికోలు, సిబ్బంది ఈ శిబిరంలో రక్తదానం చేశారు. విదేశాల్లో స్థిరపడిన వైౖద్యులతో కేఎంసీలో ప్రత్యేకంగా నిరంతర వైద్య విద్య కార్యక్రమాన్ని కొనసాగించారు. జూన్ 8న ఆటోడ్రైవర్ల కోసం ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
**1977లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి..
ఆర్‌ఎంఈఎస్ నిర్వహణలో ఉన్న వైద్య కళాశాలను ఫిబ్రవరి 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుతం స్వీకరించింది. అప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కేఎంసీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి మారింది. కేఎంసీ విద్యార్థులకు వైద్య విద్య బోధన ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్ర వైద్యశాలల్లో కొనసాగుతోంది. ఆర్‌ఎంఈఎస్ ఆధ్వర్యంలో ఎంజీఎంలో ఓపీ, టీబీ బ్లాక్, లెక్చర్ హాల్, మార్చురీని నిర్మించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఏర్పడిన తర్వాత మార్చి 1, 1987 నుంచి కేఎంసీ ఎన్టీఆర్ వర్సిటీ పరిధిలోకి మారింది. ఎంబీబీఎస్ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్న క్రమంలో 1972లో పీజీ కోర్సులకు అనుమతి వచ్చింది. అప్పటి నుంచి ఎంబీబీఎస్‌తో పాటు పీజీ తరగతులు కొనసాగుతున్నాయి. వసతులు సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ ఎంబీబీఎస్, పీజీ సీట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. 1960-65 సంవత్సరాల్లో ప్రిన్సిపల్‌గా పనిచేసిన డాక్టర్ లక్ష్మీనారాయణ కృషితోనే కేఎంసీ ఇంతగా అభివృద్ధి సాధించిందని సీనియర్ వైద్యులు గుర్తుచేసుకుంటారు.
**వేడుకలకు ముస్తాబు..
వజ్రోత్సవాల సందర్భంగా కళాశాలలో జులై 20, 21 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు ప్రముఖులు వస్తారని వైద్యులు భావిస్తున్నారు. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య సమక్షంలో వైద్యులు పలుమార్లు సమావేశమై షెడ్యూల్‌ను ఖరారుచేశారు. అలాగే ఉత్సవాలను విజయవంతం చేయడానికి కమిటీలను ఏర్పాటుచేశారు.
జులై 20, 21 తేదీల్లో వరంగల్ కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవాలు
Related tags :