ఏ నటుడైనా తను నటించిన సినిమాను విమర్శకులు ప్రశంసిస్తే సంతోషపడతారు. కానీ సల్మాన్ ఖాన్‌కు మాత్రం అలాంటి ప్రశంసలు వింటే భయం వేస్తుందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ. ఆ సంగతి సల్మానే చెబుతున్నాడు. ‘‘ఓ సినిమా ఫలితాన్ని నేను బాక్సాఫీసు వసూళ్లతోనే బేరీజు వేస్తాను. వాటి ద్వారానే ప్రేక్షకులకు నచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది. అంతే తప్ప ఎవరో (విమర్శకులు) మంచి రేటింగులు ఇచ్చినా, లేదా విమర్శించినా నేను పట్టించుకోను. విమర్శించడమే వారికి ఉపాధి. దేవుడి ఆశీర్వాదంతో వారికి ఇంకొంచెం ఎక్కువ ఆహారం దొరకాలనుకుంటా. ఒక వేళ వారు నా సినిమాలకు అద్భుతమైన రేటింగులిచ్చినా నాకు భయమేస్తుంది. ఎందుకంటే వారి ఆలోచన విధానం ప్రేక్షకుల అభిరుచితో ఎప్పటికీ సరిపోలదు. అందుకే వారు మెచ్చుకున్నారు కాబట్టి ఆ సినిమా ఆడదేమో అని అనుమానపడుతుంటాను. నా వరకూ ప్రేక్షకులు థియేటర్లో అడుగుపెట్టాక బయటి ప్రపంచాన్ని మర్చిపోయి సినిమాను ఆస్వాదించాలి. దాంతో పాటు ఆ కథలోని స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఓ మంచి వ్యక్తిగా థియేటర్ బయటకు వెళ్లాలి. ఓ సినిమాను ఎంచుకునేటప్పుడు ఈ విషయాలనే దృష్టిలో పెట్టుకుంటాన’’న్నారు సల్మాన్. ఆయన నటించిన ‘భారత్’ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంటోంది.
ప్రశంసలంటే భయం
Related tags :