Fashion

చర్మపు రంగు వివక్షపై భన్సాలీ చిత్రం

Bhansali to make a movie on how and why Indian youth is obsessed with fair skin

నల్లగా ఉన్న అమ్మాయి తన రంగు గురించి చాలా నిరాశతో ఉంటుంది. తన రంగు కారణంగానే ఉద్యోగ అవకాశాలు రావడం లేదని చింతిస్తూ ఉండగా మా కంపెనీ క్రీమ్‌ వాడండి… మీ చర్మం రంగు తెల్లగా మారిపోతుందంటూ ఓ అందమైన సినిమా తార చెబుతుంది. ఆ క్రీమ్‌ వాడగానే నల్ల అమ్మాయి తెల్లగా మెరిసిపోవడమే కాదు మంచి ఉద్యోగం సంపాదిస్తుంది…. చర్మం రంగుకి సంబంధించి ఈ తరహా ప్రకటనలు చాలానే చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో ఈ విషయంపై చాలామంది గళమెత్తారు. రంగుకీ, వ్యక్తిత్వానికి, విజయానికీ సంబంధం ఉండదు అంటూ చాలామంది నిరూపించారు కూడా. చర్మపు రంగు… సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమలు… ఈ నేపథ్యంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ. ఆయన ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌, ఆలియాభట్‌తో ‘ఇన్‌షా అల్లా’ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రం తర్వాత కొత్త నటులతో ఈ కథను తీయాలనేది సంజయ్‌ ఆలోచన అని బాలీవుడ్‌ సమాచారం. పలువురి దర్శకుల్ని పరిశీలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ సంబంధించిన కథాంశం కాబట్టే ఈ కథను భన్సాలీ నిర్మించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.