Agriculture

వలస రైతులకు దక్కని బీమా

Farmers who went abroad are facing trouble to get insurance for their land and crops

వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. పండించిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో సొంత ఊరిని వదిలి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన రైతులకు ‘రైతు బీమా’ పథకం వర్తించడం లేదు. ఉపాధి కోసం గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లిన వారిలో భూమి ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. వీరికి రైతు బీమా పథకం అందకుండా పోతోంది. దీంతో పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లిన రైతులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం ద్వారా భూ యజమానులకు కొత్త పట్టా పాస్‌పుస్తకాలు, ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించింది. అయితే, స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసు పుస్తకాన్ని, రైతు బంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధనలు వలస రైతుల పాలిట శాపంగా మారాయి. రైతు బీమా, రైతు బంధు పథకం వర్తించడానికి విదేశం నుంచి స్వదేశానికి రావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన మొదట్లో విదేశాల్లో ఉన్నవారికి రైతుబంధు ప్రయోజనాలను వర్తింపజేయకపోవడం వల్ల ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో రైతుబంధు పథకాన్ని గల్ఫ్‌లో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు వర్తింపజేయాలని ఎమిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం(ప్రవాసీ సంక్షేమ వేదిక) ఆధ్వర్యంలో ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సైతం పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది జూలై 7న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రం సమర్పించారు. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఎమిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, మాజీ భారత రాయబారి బి.ఎం.వినోద్‌కుమార్‌లు ప్రవాసంలో ఉన్న తెలంగాణ రైతుల పక్షాన ఉమ్మడి హైకోర్టులో గతేడాది జూలై 20న ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది బొల్లు రచనారెడ్డి వాదించారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని, రెండు నెలల్లో గల్ఫ్‌లోని ప్రవాసీలకు ‘రైతుబంధు’ వర్తింపును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్‌ రాధాకృష్ణన్, జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని గతేడాది జూలై 24న ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎన్నారై కుటుంబ సభ్యులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేయాలని అప్పట్లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, రూ.5లక్ష బీమా వర్తింపు విషయంలో ఇప్పటివరకు సానకూల నిర్ణయం తీసుకోకపోవడంతో వలస రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిబంధనలను సడలించి వలస వెళ్లిన ప్రవాసీ రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు.