* ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర వెళ్ళిన ముఖ్యమంత్రి మద్యాహ్నం ముంబై చేరుకున్నారు. ఎయిర్ పోర్టు రోడ్డు మార్గంలో రాజ్ భవన్ చేరుకున్నారు. అక్కడ గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్నా పధకాలను విద్యాసాగర్ రావు వివరించారు.
* పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా సీపీఐ శుక్రవారం హైదరాబాద్ అర్థనగ్న ప్రదర్శన చేపట్టింది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆపాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషాతో పాటు పలువురు పార్టీ నేతలు అర్థ నగ్నంగా నిరసన తెలిపారు. ’పదవులను అమ్ముకున్న ప్రజా ప్రతినిధులు ఏదైనా అమ్ముకునే సమర్థులు.. అమ్ముడపోయిన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులారా…తస్మాస్ …జాగ్రత్త….’ అని బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
*రైళ్లలో మసాజ్ సేవలపై బీజేపీ ఎంపీ మండిపాటు
రైళ్లలో మసాజ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వేలు చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ మండిపడ్డారు. రైల్వేల ప్రతిపాదన చౌకబారు నిర్ణయమని ఇండోర్ ఎంపీ లాల్వానీ తప్పుపట్టారు. తోటి మహిళా ప్రయాణీకుల సమక్షంలో రైళ్లలో మసాజ్ సేవలను అందుబాటులోకి తేవడం సరైంది కాదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా ప్రయాణీకులు కూడా రైళ్లలో ప్రయాణించే క్రమంలో ఆయా రైళ్లలో మసాజ్ సేవలను ప్రవేశపెట్టడం భారత సంస్కృతికి విరుద్ధమని రైల్వే మంత్రికి రాసిన లేఖలో ఆక్షేపించారు. రైలు ప్రయాణీకులకు వైద్య సేవలు కల్పించడం పక్కనపెట్టి మసాజ్ సేవలను ముందుకు తీసుకురావడం బాధ్యతారాహిత్య చర్యని ఆయన మండిపడ్డారు. కాగా రైళ్లలో మసాజ్ సేవలను నిరసిస్తూ తనను ఇటీవల కొందరు మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారని, వారి అభ్యంతరాలనే తాను రైల్వే మంత్రికి రాసిన లేఖలో పొందుపరిచానని ఎంపీ లాల్వానీ పేర్కొన్నారు.
* అమిత్ షాతో జగన్ భేటీ
హస్తినకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. జగన్ వెంట వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రఘురామకృష్ణం రాజు, అవినాశ్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
*సమ్మె అమిత్ షా కుట్ర
జూనియర్ డాక్టర్ల సమ్మె వెనుక బీజేపీ, సీపీఎం కుట్ర ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బయటి వ్యక్తులు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లోకి వచ్చి సమస్య సృష్టిస్తున్నారని అన్నారు. ” జూనియర్ డాక్టర్ల సమ్మెను ఖండిస్తున్నా. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. సమ్మెకు బీజేపీ మతపరమైన రంగు పూస్తోంది. సీపీఎం సాయంతో హిందూ, ముస్లిం రాజకీయాలకు పాల్పడుతోంది. ఆ రెండు పార్టీల లవ్ అఫేర్ చూసి షాక్ అయ్యా . మతపరమైన అల్లర్లు సృష్టించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా ఫేస్ బుక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు” అని ఆరోపించారు. మూడురోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో ఆరోగ్య శాఖ చూస్తున్న సీఎం మమతా బెనర్జీ గురువారం మధ్యాహ్నం కో ల్ కతా లోని ఎస్ఎస్ కేఎం ఆస్పత్రిని సందర్శించారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి వెంటనే విధుల్లోకి చేరాలని లేకుంటే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. తమకు న్యాయం చేయాల్సిందేనని జూనియర్ డాక్టర్లు మమత ఎదుటే నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవలకు అంతరాయం కలిగిందని, ఆస్పత్రి ప్రాంగణాలను క్లియర్ చేయాలని పోలీసులకు మమత ఆదేశించారు. రోగులు తప్ప క్యాంపస్ లోకి ఎవర్నీ అనుమతించరాదని హుకుం జారీ చేశారు.
* టీఆర్ఎస్ లో బయటపడ్డ విభేదాలు
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బాంబు పేల్చారు. తన ఓటమికి కుట్రలే కారణమన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు పరాభవం ఎదురైందన్నారు. కారకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టడంలో ఫెయిల్ అయ్యామని ఆవేదన చెందారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాను.. అయినా సప్త సముద్రాలు దాటి కాల్వలో పడి చచ్చినట్లు రోడ్ రోలర్ ఢీకొట్టి ఓడానన్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలున్నట్లు తన పరిస్థితి ఉందని, ఎవరినీ నిందించనంటూనే తన మనసులోని మాట చెప్పారు.. ఇదంతా ఏ నలుగురు కార్యకర్తలతోనో.. పార్టీ అంతర్గత సమావేశాల్లోనో చెప్పిన ముచ్చట్లు కానే కాదు.. స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ కుండ బద్దలు కొట్టారు. ఎంపీగా ఓటమి తదుపరి భువనగిరి, జనగామలో బుధవారం పర్యటించిన ఆయన రెండుచోట్ల తన ఆవేదన వెళ్లగక్కారు. ఓడించినా ప్రజల మధ్యనే ఉంటానని తన శ్రేణుల్లో భరోసా నింపారు. ఇప్పుడీ ముచ్చట్లు టీఆర్ఎస్ వర్గాల్లో హాట్టాపిక్ గా మారాయి. ఇటీవలి ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్నుంచి సిట్టింగ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బూర తన ప్రత్యర్థి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు గత నెల 23న వచ్చాయి. అప్పటి నుంచి బూర సైలెంట్గా ఉన్నారు. ఇదే క్రమంలో బొమ్మల రామారం మండలంలోని ఇద్దరు ముఖ్యనేతలు, రెడ్డి, బీసీ సామాజిక వర్గాల మధ్య ఉన్న దూరం… బూరకు సహాయ నిరాకరణ వంటి వాయిస్రికార్డ్ వాట్సప్ గ్రూపులో రచ్చ చేసింది. కొన్నాళ్లకు అది సద్దుమణిగింది. కానీ తాజాగా మళ్లీ బూర నర్సయ్య తన ఓటమి కోసం నేతలు కుట్రలు చేశారని ఆరోపించడం గులాబీ శ్రేణులను షాక్కు గురి చేసింది.
* వైకాపా తెదేపా ఎమ్మెల్యే లు చేరట లేదు
తెలుగుదేశం పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ఇప్పటి వరకు చూపించారు. అయితే అసెంబ్లీ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో వైస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి హడలిపోతున్నారు. తెలుగుదేశం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి ఆసక్తి తో ఉన్న ఓ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, నేరుగా ఇద్దరు శాసనసభ్యులు తనతోనే సంప్రదింపులు జరుపుతున్నారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఎవరైనా మన పార్టీ లో చేరాలనుకునే వారిని తమ శాసన సభ, మండలి సభ్యత్వాలకు రాజీనామా చేసి చేరమని సూచించారని తెలిపారు.
* పోలవరానికి పూర్తిగా సహకరించండి- వెంకయ్య
నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు సూచించారు. శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన కేంద్రమంత్రికి 1981-82లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి నేపథ్యాన్ని వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందించాలని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా కోరారు.
* జగన్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నాం: భట్టి
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదలుపెట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌ను మార్చి.. కాళేశ్వరంగా రీడిజైన్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ వస్తే.. వైఎస్ జలయజ్ఞాన్ని తప్పుపట్టినట్లేనని విమర్శించారు. కాళేశ్వరం డీపీఆర్‌ను అసెంబ్లీలో ఇంతవరకు పెట్టలేదని, కాళేశ్వరం ప్రారంభానికి పక్క రాష్ట్రాల సీఎంలను పిలుస్తున్నారని, కానీ మన రాష్ట్రంలో ఉన్న నేతలెవరూ కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అవినీతిపై ప్రశ్నిస్తారనే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని, పార్టీ ఫిరాయింపులపై జగన్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.
* పాఠశాలల రూపురేఖలు మారుస్తాం- జగన్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
* హోం మంత్రికి బెదిరింపు కాల్స్
భాజపా సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్స్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 20న ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ రూపంలో బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈనెల10న కిషన్ రెడ్డి సీసీఎస్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్ నుంచి కాల్ చేసి చంపుతామని అజ్ఞాత వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
*తెరాస లోక్‌సభాపక్ష నేతగా నామా
తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు ఎన్నికయ్యారు. పార్టీ ఉపనేతగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపికయ్యారు. పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొనసాగనున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్‌సభాపక్ష నేత ఎంపికపై కేసీఆర్ సమావేశంలో చర్చించారు.
*కమల దళాధిపతి అమిత్ షానే!
భాజపా జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి అమిత్‌షానే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదే హరియాణా, జమ్ము-కశ్మీర్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అవి పూర్తయ్యే వరకు ఆయనే పదవిలో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంటే డిసెంబరు వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని, వచ్చే ఏడాదే కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని పేర్కొన్నాయి. అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా నియమితులు కావడంతో అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటారని ఊహాగానాలు వ్యాపించాయి.
*తెలంగాణలో భాజపాను బలోపేతం చేయాలి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వచ్చినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు చోట్ల విజయం సాధించడం మంచి పరిణామమని, ఇదే ఉత్సాహంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. జాతీయ పదాధికారులు, రాష్ట్రాల అధ్యక్షులతో దిల్లీలో గురువారం నిర్వహించిన సమావేశంలో అమిత్‌షా ప్రసంగిస్తూ.. తెలంగాణలో, పశ్చిమబెంగాల్‌లో పార్టీ గెలుపొందిన ఎంపీ సీట్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణలో భాజపా 4 ఎంపీ సీట్లను గెలుచుకోవడంపై అమిత్‌షా సంతోషం వ్యక్తంచేశారు.
*ఫిరాయింపులపై చర్చకు సిద్ధమేనా?
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. దీనిపై త్వరలోనే రాజ్యాంగ నిపుణులు, ఇతర మేధావులతో విస్తృతస్థాయి సదస్సు నిర్వహిస్తామని గురువారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. తెలంగాణలో జనస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అటువంటి కుట్రలను భగ్నం చేసేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు.
*ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందని, పార్టీ ఖాళీ అవుతుందనే భయంతో భట్టి విక్రమార్క తదితరులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తెరాస నేతలు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన చరిత్ర ఉన్న ఆ పార్టీకి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదని పేర్కొనారు. గురువారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు విలేకరులతో మాట్లాడారు.
*కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ భేటీ నేడు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం రెండింటి ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు దిల్లీ చేరుకోనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు అమిత్‌షాను కలవనున్నారు. ఆయనతో భేటీ తర్వాత శుక్రవారం రాత్రి దిల్లీలోని 1-జన్‌పథ్‌లో బస చేయనున్నారు.
*నా వాయిస్ తగ్గదు.. పోరాటం ఆగదు: బాబు
‘మీకు ఎలాంటి డౌటు అక్కర్లేదు. చాలా పోరాటాలు చూశాం. నా వాయిస్ తగ్గదు. పోరాటం ఆగదు’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో కొత్త సభాపతి తమ్మినేని సీతారాంను అభినందించే క్రమంలో చంద్రబాబు మాట్లాడుతుండగా తొలుత మాటలు వినిపించలేదు. దీంతో మాట తగ్గిపోయిందని, వినబడటం లేదంటూ వైకాపా సభ్యులు వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన స్పందించారు. తన వాయిస్ తగ్గలేదని, మైకు సరిగా లేదని చెప్పారు. ‘మా ఆధ్వర్యంలో మైకులు బాగానే పని చేశాయి. మీ ఆధ్వర్యంలోనే మైకులు సరిగా లేవు’ అని వ్యాఖ్యానించారు.
*ఉత్సాహం మరింత పెరిగింది
భాజపా అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశంతో పార్టీలో ఉత్సాహం మరింత పెరిగిందని భాజపా మహిళా మోర్చా ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. గురువారమిక్కడ అమిత్‌షా నేతృత్వంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా అమిత్‌షా దిశానిర్దేశం చేశారన్నారు. ఒడిశా, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడం మంచిపరిణామమని చెప్పారన్నారు.
*కార్యకర్తలు పనిచేయలేదు: ప్రియాంక
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సరిగ్గా పనిచేయలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. తల్లి సోనియా గాంధీతో కలిసి ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె గురువారం పార్టీ కార్యకర్తలతో కాస్త కటువుగానే మాట్లాడారు. పార్టీ కోసం పనిచేయని కార్యకర్తల పేర్లను తెలుసుకుంటానని అన్నారు. ‘‘నా హృదయం నుంచి వచ్చిన మాటలను చెబుతున్నా. మీరు ఎన్నికల్లో నిజాయతీగా పోరాడలేదు. ధైర్యంలేని వారు, రాజీపడేవారు, పార్టీ కోసం హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేనివారికి కాంగ్రెస్‌లో చోటు ఇవ్వలేం.’’ అని అన్నారు.
*నాడు తండ్రి సభాపతి.. నేడు తనయుడు ఉప సభాపతి
రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నికను ఈ నెల 18న శాసనసభలో అధికారికంగా ప్రకటించనున్నారు. గురువారం సభాపతి తమ్మినేని సీతారాం ఎన్నిక పూర్తవడంతో ఉప సభాపతి ఎన్నిక ప్రక్రియకు రంగం సిద్ధం చేశారు. సభాపతిలాగే ఉప సభాపతి పదవికి కూడా ఒకే నామినేషన్(కోన రఘుపతి మాత్రమే) దాఖలయ్యే అవకాశం ఉన్నందున.. ఆయన నియామకం లాంఛనమేనని వైకాపా వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 1981లో సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించిన కోన ప్రభాకరరావు తనయుడే కోన రఘుపతి. అప్పుడు తండ్రి సభాపతిగా విధులు నిర్వహించగా ఇప్పుడు తనయుడు ఉప సభాపతి కానున్నారు.
మహారాష్ట్ర గవర్నర్‌తో కేసీఆర్ భేటీ-రాజకీయం-06/14
Related tags :