ప్రపంచ దేశాలను చుట్టివచ్చిన అత్యంత పిన్న వయస్కురాలిగా అమెరికాకు చెందిన యువతి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోనున్నారు. తాజాగా ఉత్తర కొరియాలో అడుగుపెట్టి లెక్సి ఆల్ఫ్రెడ్ చిన్న వయసులోనే 196 దేశాలు చుట్టిరావాలన్న తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన ఆ యువతి వయసు కేవలం 21 సంవత్సరాలే. ప్రస్తుతం 24 ఏళ్ల మహిళ మీద ఉన్న ఈ రికార్డును ఈమె బద్దలు కొట్టారు.‘‘గత ఆరు నెలలకు పైగా అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ ఎంతో ఆత్రుతగా ఈ రోజు కోసం ఎదురుచూశాను’’ అని లెక్సి మీడియాకు వెల్లడించింది. తన ప్రయాణానికి కావాల్సిన డబ్బును తానే సమకూర్చుకున్నానని తెలిపింది. ‘‘కనిపించిన ప్రతి పనిచేశా. 12 ఏళ్ల వయసు నుంచే దాచుకోవడం మొదలు పెట్టా’’ అని తన కలను నెరవేర్చుకోడానికి చేసిన ప్రయత్నాలను వివరించింది. ‘‘నిధులు సమకూర్చుకోవడానికి అనేక బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాను. అవసరమైన ఒప్పందాలేంటో తెలుసుకోవడానికి ముందుగా చాలా పరిశోధన చేశా. తక్కువ ధరలో లభ్యమయ్యే వసతి మాత్రమే ఉపయోగించాను’’ అని ఆమె వెల్లడించింది. ఈ ప్రయాణానికి కావాల్సిన డబ్బులు సంపాదించడం కోసం తన కుటుంబానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీలోనే లెక్సి పనిచేసింది. ఆ ట్రావెల్ ఏజెన్సీనే ప్రయాణాల మీద ఆమెకు ఆసక్తి కలగడానికి కారణమైంది. ‘‘మా తల్లి దండ్రులు ప్రతి సంవత్సరం పాఠశాలకు దూరంగా కొన్ని రోజుల పాటు నన్ను వేరే ప్రాంతంలో ఉంచి, స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించారు’’ అని ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను, తన పర్యటనకు పడిన పునాది గురించి వివరించింది. ఎప్పటి నుంచో ఈ పర్యటనపై ఆలోచనలు చేసినా, 2016 నుంచి ఈ రికార్డు సాధనపై తీవ్రంగా దృష్టి సారించింది. ఆమె తన లక్ష్యాల మీద పూర్తి స్థాయిలో పనిచేసే ఉద్దేశంతో స్థానిక కళాశాల నుంచి చిన్నవయసులోనే అసోసియేట్ డిగ్రీని సొంతం చేసుకుంది. తన పర్యటనలో భాగంగా ప్రతి ప్రదేశంలో రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ కాలం గడపలేదని తెలిపింది. ప్రస్తుతం 196 దేశాల పర్యటనకు సంబంధించి 10,000 ఆధారాలను గిన్నిస్ బుక్కు సమర్పించే పనిలో ఆమె నిమగ్నమైంది.
21 ఏళ్లకు 196 దేశాలు తిరిగేసింది

Related tags :