Agriculture

ఏరువాక పున్నమికి పులకించే రైతన్న!

Yeruvaka punnami and its importance in Indian farming fraternity-eruvaka pournami 2019

ఏరువాక అంటే ప్రతి రైతు గుండె పైరు వెన్నులా నాట్యం చేస్తుంది. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. ఏరు అంటే నాగలి లేదా హలం. వాక అంటే దుక్కి దున్నడం. ఇది తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ ఇళ్ళలో చేసుకొనే వేడుక.ఋతువుల క్రమాన్ని అనుసరించి జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు గ్రీష్మం. ఇది దక్షిణాదిన ఎండాకాలం. అయితే జ్యేష్ఠ మాసంలో రోహిణీ కార్తె ముగిసి, మృగశిర కార్తె ప్రవేశించడంతో… నైరుతి ఋతుపవనాలు వాన రాకడను తెలియజేస్తాయి. రోహిణీ కార్తెలో నెర్రలు విచ్చిన పొలం… మృగశిర కార్తెలో కురిసిన చిరు జల్లులతో దుక్కి దున్నడానికి వీలుగా తయారవుతుంది. కృషీవలురు తమ నేల తల్లిని సంప్రదాయానుసారం పూజించడానికి ఏరువాక పున్నమిని పర్వదినంగా భావిస్తారు.
**యుగయుగాలుగా..
త్రేతాయుగంలో జనక మహారాజు హలం పట్టి దుక్కి దున్నుతుండగా అయోనిజగా సీత జన్మించిందని రామాయణ గాథ. శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా జన్మించగా, ఆయనకు జంటగా సీత ధర్మరక్షణకు సాయపడింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి అన్నగా బలరాముడు జన్మించి, హలాన్నే ఆయుధంగా చేసుకొని, పాడిపంటల ఆవశ్యకత వివరించాడు. సస్యఫలాలు శ్రమైక జీవనం ద్వారానే సాధ్యమని బోధించాడు. ఇలా చూస్తే ఏరువాక ఆశల తోరణం. సాంప్రదాయసిద్ధంగా ఈ దేశంలో రైతు జనానికి యుగయుగాలుగా ఉత్సాహాన్నీ, ఉద్వేగాన్నీ అందిస్తున్న పండుగ. ఏరువాక పున్నమి ప్రస్తావనా, ప్రస్తుతీ వేదాల్లోనూ ఉంది. చారిత్రకంగా చూస్తే… కపిలవస్తు నగరంలో శుద్ధోధన మహారాజు ఏరువాక పున్నమి రోజున రైతులకు కానుకలు ఇచ్చాడనీ, కృషీవలులకు శ్రీకృష్ణదేవరాయలు ధన, వస్తు రూపేణా సహాయం అందించాడనీ ఆధారాలు లభిస్తున్నాయి.
**ఒకే పున్నమి… ఎన్నో పేర్లు!
ఏరువాకను జ్యోతిష శాస్త్రవేత్తలు ‘కృష్యారభం’, ‘సస్యారంభం’ అని వ్యవహరిస్తారు. ఏరువాక పున్నమిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పాటిస్తారు. ఎవరు ఎలా ఆచరించినా అంతరార్థం ఒకటే. పాడిపంటలకూ, పొలం పనులకూ ఎటువంటి అవరోధం కలుగకూడదని కోరుకుంటూ… ఈ ప్రక్రియను ఒక మహా యజ్ఞంగా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి చాలులో సీత దొరికింది కాబట్టి ‘సీతా యజ్ఞం’గా కొందరు భావిస్తే… ఉత్తర భారతంలో ‘ఉద్వృషభ యజ్ఞం’ అని దీన్ని అంటారు. ఇంకా ‘కృషి పున్నమి’ అనీ, ‘హలపున్నమి’ అనీ కూడా పిలుస్తారు. మృగశిరలో కురిసే తొలకరి చినుకు మున్ముందు కురిసే వర్షానికీ, పంటసిరికీ అవసరమనే భావనతో… సమృద్ధి అయిన వర్షాలకు అంకురార్పణ జరగాలని కోరుకుంటూ వరుణ దేవుణ్ణీ, దిక్పాలకులనూ, వర్షాధిపతి అయిన ఇంద్రుణ్ణీ పూజిస్తారు.
**నింగీ నేలా ఉప్పొంగేలా…
ఈ పున్నమి రోజున పల్లె పడుచుల ఆనందం ఇంతింత కాదు. పండబోయే పంట చేను కళ్ళ ముందర కనువిందు చేస్తూ, ఆనందంతో పకపకా నవ్వుతుంది. పంట కాలువలా ఉద్వేగం పరుగులు తీస్తుంది. చీకటి పొద్దునే లేచి, పశువుల కొట్టాలను కడిగి, ముగ్గులు పెట్టి, మామిడాకు తోరణాలతో అలంకరిస్తారు. రైతన్నలు ఎద్దుల్ని కడిగి, కొమ్ములకు రంగులద్ది, మెడలో గంటలు కట్టి ముస్తాబు చేస్తారు. పశువుల కొట్టానికీ, ఎద్దులకూ, నాగళ్ళకూ ధూపాలు వేసి, దీపాలను సమర్పిస్తారు. పొంగలి వండి, నివేదనగా వాటికి ఆరగింపు చేస్తారు. వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, పసుపుకుంకుమ అద్దుతారు. మాపటివేళ బంధుజనంతో, ఎడ్లు, నాగళ్ళు తదితర సరంజామాతో తమ పొలాలకు చేరుతారు. ముందుగా పొలిమేరలో రెండు రాటలు పాతి, వాటికి గోగునార చుట్టి, తోరణం కడతారు. తమ చర్నాకోలలతో ఆ తోరణాన్ని కొట్టి, రాలిన గోగు నారను ఎద్దుల మెడల మీదా, పొలాల్లోనూ చల్లుతారు. కొంత తమ గాదెలలో వేస్తారు. ఇలా చేస్తే శుభం కలుగుతుందనీ, పంటలు బాగా పండుతాయని నమ్మకం. ఆ వెంటనే హలానికి ఒక వైపు ఎద్దును కట్టి, రెండో వైపు రైతన్న పట్టి దుక్కి దున్నడం ప్రారంభిస్తాడు. పశువులు పడే శ్రమలో తాను కూడా పాలు పంచుకుంటున్నానని తెలియజేయడమే ఇందులోని పరమార్థం. అనూచానంగా వస్తున్న సాంప్రదాయం ఇది.
**జగన్నాథుడికి విశ్రాంతి
మరో విశేషం ఏమిటంటే, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఒడిశా రాష్ట్రంలోని పూరీలో శ్రీ జగన్నాథ స్వామికి ‘స్నానోత్సవం’ జరుగుతుంది. జగన్నాథ, సుభద్ర, బలరాములకు స్నానవేదికపై స్నానం చేయించి, పదిహేను రోజుల పాటు విశ్రాంతి కోసం ఏకాంతంగా ఉంచుతారు. ఈ పదిహేను రోజులు భక్తులకు దర్శనం ఉండదు. స్వామివారికి ప్రతీకగా ఒక చిత్రపటాన్ని గర్భగుడి ముందు ఉంచుతారు. తిరిగి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున (రథయాత్ర ముందు రోజు) స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుంది. దీన్ని ‘నవయవ్వన దర్శనం’ అంటారు. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున వైష్ణవాలయాలలో మూలవిరాట్టులకు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు.
**సామెతల్లో…
మృగశిర కార్తెలో కురిసే చిరుజల్లుల గురించి ఎన్నో సామెతలు వాడుకలోనూ, సాహిత్యంలోనూ చోటుచేసుకున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని: మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడతాయి. మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది. మృగశిర కురిస్తే ముక్కారు పంట పండుతుంది.