భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. అంచనాల మేర రాణించి సత్తాచాటింది. ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నీలో విజేతగా నిలిచి అబ్బురపరచింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 5-1 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి టైటిల్ సొంతం చేసుకుంది. ఫేవరేట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్.. అజేయంగా ఫైనల్ చేరి అద్భుత విజయంతో ముగించింది. వరుణ్ కుమార్ (2వ, 49వ నిమిషాల్లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ, 25వ నిమిషాల్లో) చెరో రెండు గోల్స్‌తో చెలరేగారు. వివేక్ సాగర్ ప్రసాద్ (35వ నిమిషంలో) ఓ గోల్ కొట్టాడు. ప్రత్యర్థి జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను రిచర్డ్ (53వ నిమిషంలో) చేశాడు. తుదిపోరులో భారత్ ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ ఆరంభమైన రెండు నిమిషాలకే లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన వరుణ్ భారత ఖాతా తెరిచాడు. అదే జోరులో భారత్ 11వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ సాధించింది. ఈ సారి హర్మన్‌ప్రీత్ దాన్ని విజయవంతంగా గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించిన భారత్ ఓ దశలో 5-0తో మ్యాచ్‌పై తిరుగులేని పట్టు సాధించింది. చివర్లో రిచర్డ్ గోల్ కొట్టి ఆధిక్యాన్ని తగ్గించాడు. భారత జట్టు ఇప్పటికే ఒలింపిక్స్ క్వాలిఫయర్ చివరి రౌండ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఆ టోర్నీ జరగనుంది.
హాకీలో భారత జట్టు ఘనవిజయం
Related tags :