రైళ్లలో మసాజ్ సేవలను ప్రారంభించాలన్న రైల్వేశాఖ ప్రతిపాదనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ప్రతిపాదనలను విరమించుకున్నట్లు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపట్టారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని అన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు సుమిత్రా మహజన్ ఇటీవల లేఖ రాశారు. రైళ్లలో ఇలాంటి సేవలు అందించడం సరైందేనా.. అది కూడా మహిళల ముందు అవసరమా అని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. అంతకు ముందు ఇండోర్‌కు చెందిన భాజపా ఎంపీ శంకర్ లాల్వానీ కూడా గోయల్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. భారతీయ రైల్వేల చరిత్రలో తొలిసారిగా ప్రయాణికులకు మసాజ్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నామని రైల్వేశాఖ ఇటీవల ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బయల్దేరే 39 రైళ్లలో ఈ సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తల, కాళ్ల మసాజ్‌కు రూ. 100 నుంచి రూ. 300 దాకా వసూలు చేయాలని భావించింది. అంతేకాకుండా పశ్చిమ రైల్వేజోన్ రత్లాం డివిజన్‌కు చెందిన అధికారులు రైళ్లలో మసాజ్ సేవలను ప్రారంభించనున్నామని ఇటీవలే వెల్లడించారు. దీనివల్ల అధికాదాయం సమకూరుతుందన్నది వారి అభిప్రాయం. అయితే దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవడంతో రైల్వేశాఖ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
భారతీయ రైళ్లల్లో మసాజ్ సేవలు ఉండవు
Related tags :