Agriculture

రుతుపవనాల జాడ లేదు

No monsoon rain in telugu states - full summer kicking in

కోస్తాంధ్రలో భానుడు భగ్గుమంటున్నాడు. వేసవి ముగిసినా ఎండలు మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో వేడి, ఉక్కపోతతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురవాల్సిన ఈ సమయంలోనూ ఎండలు ఠారెత్తిస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో శనివారం అత్యధికంగా 45.18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా బొండపల్లి, కన్నెమెరికలో 45.14 డిగ్రీలు, ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 60 ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీలు, 202 ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. ఈ నెల 18 వరకు ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని అధికారులు ప్రకటించారు. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గినందున వడగాలులు అనూహ్యంగా పెరుగుతున్నాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది.