Devotional

శివుని సైతం వేధించిన శని బాధ

Shaneeshwara Didnt Leave Lord Shiva Himself - Shani Trayodashi Special

మనిషి కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతుంటాడు. చేసిన కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. లయ కారుడైన పరమశివుడు ఈ బాధ్యతలను శనీశ్వరుడికి అప్పగించాడు. అందుకే శనీశ్వరుడిని కర్మఫలదాత అంటారు. కష్టంలో ఉన్నప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. మన లోపాలను సరిదిద్దుతూ, అప్పుడప్పుడూ హెచ్చరిస్తూ చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు శనిదేవుడు.సూర్యభగవానుడు, ఛాయా సంతానం శనిదేవుడు. అందుకే ఆయనను సూర్య పుత్రుడు అనీ, ఛాయాసుతుడు అని అంటారు. నవ గ్రహాల్లో అత్యంత శక్తిమంతుడు శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు దాని పరిణామం తక్కువగా కలిగించాలని జనులు శనీశ్వరుడిని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాలను దర్శిస్తారు. ఇక త్రయోదశి నాడు వచ్చే శనివారం నాడు శనీశ్వరుడిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. శని త్రయోదశికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. శనివారం శని భగవానునికి, విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. శని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అంటారు.శని త్రయోదశి ప్రాముఖ్యతని వివరించే ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడడం మొదలు పెట్టాడు. వీలు చూసుకుని శని తన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తుంది. ఎవరూ శనికి అతీతులు కారు అని అంటాడు. నారదముని మాటలకు ఆగ్రహించిన శివుడు.. శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా.. నా మీద మాత్రం పనిచేయదు.. ఆయన ఆటలు నా దగ్గర సాగవు అని అంటారు. ఇక నారద మహర్షి మూడిళ్ల పూజారి కదా.. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చేరవేయడంలో అమిత ఆనందం పొందుతాడు. వెంటనే శివుడు అన్న మాటలు తీసుకెళ్లి శనీశ్వరుడి చెవిన వేస్తాడు. అదీ చూద్దాం ఆయన ఎలా తప్పించుకోరు అని శని అంటాడు.నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు.. ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని మాటలు గుర్తొచ్చాయి పరమేశ్వరునికి. సమయం వచ్చినప్పుడు పరమ శివుడు కూడా తప్పించుకోలేడు అని శని శపథం గురించి తెలిసిన శివుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. శని తన వాగ్ధానం నెరవేర్చుకుంటే లయకారుడైన తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావించాడు శివుడు. అందుకే శని చెప్పిన సమయానికి అతడి కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఉన్న ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు.హమ్మయ్య శనికి నన్ను గుర్తించే అవకాశం లేదు. ఇక నన్నెలా పట్టి పీడిస్తాడు అని అనుకున్నాడు శివుడు. ఆ రోజు గడిచి పోయిన తరువాత భూలోకం నుంచి కైలాసానికి వెళతాడు. అక్కడికి వచ్చిన శని దేవుడిని చూసిన శివుడు.. ఏదీ నన్ను పట్టి పీడిస్తానన్నావు కదా ఏమైంది నీ శపథం అని అడుగుతాడు. దానికి శని.. ప్రభూ! ముల్లోకాలకు లయకారుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదా. దీన్నే శని పట్టడం అంటారు అని అనేసరికి శని దేవుని శక్తిని గ్రహిస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు శివుడు.. శనితో ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందంటాడు. ఇకపై నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో పరిఢవిల్లుతావని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి నాడు వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకిస్తే శని ప్రభావం కాస్త తగ్గుతుందని భావిస్తారు భక్తులు.