Business

ఆ నౌకల మునక…మీ పెట్రోల్ ధర పెంచింది

The blasts of two oil carrying vessels has increased fuel prices

తీర ప్రాంతాలు విదేశీ దురాక్రమణలకు గురికాకుండా ఆ ఆయుధాన్ని అక్కడ ఎక్కుపెట్టి ఉంచుతారు. పొరబాటున శత్రువుల నౌకలు అటుగా వచ్చాయా.. అంతే సంగతులు.. తుత్తునియలై సముద్రంలో కలిసిపోతాయి. కొన్ని సందర్భాల్లో అవి పొరబాటున పేలి ఏ సంబంధం లేని నౌకలు కూడా మునిగిపోతాయి. అవే సముద్ర మందు పాతరలు. తాజాగా గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో ఇటువంటి మైన్స్‌ ఇప్పుడు సంక్షోభానికి కారణమయ్యాయి. రెండు చమురు ట్యాంకర్లపై దాడి జరగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు ఒక్కరోజులోనే 4శాతం పెరిగాయి. ఒమన్‌ గల్ఫ్‌లో రెండు చమురు నౌకలపై దాడుల నేపథ్యంలో ఇరాన్‌, అమెరికాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇరాన్‌ ఉగ్రవాద దేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగా ఆరోపించారు. హోర్ముజ్‌ సింధుశాఖను ఇరాన్‌ మూసేయజాలదన్నారు. దాడులకు ఇరాన్‌ దళాలే కారణమని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌(సెంట్‌కామ్‌) ఆరోపించింది. మరోవైపు.. జపాన్‌కు చెందిన కోకుకా కరేజియస్‌ నౌకకు అతికిన పేలని లింపెట్‌ మైన్‌ను ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డుకు చెందిన సైనికులు తొలగిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను సెంట్‌కామ్‌ విడుదల చేసింది. ఇది సదరు సంఘటనకు సంబంధించి ఆధారాల్ని తొలగించేందుకు ఇరాన్‌ చేసిన యత్నంగా తెలుస్తోందని అమెరికా ఆరోపించింది. 1987-88లో కూడా యూఎస్‌ఎస్‌ శామ్యూ బి రాబర్స్ట్‌ అనే నౌక సముద్ర మందుపాతర పేలుడులో చిక్కుకుంది. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్‌కు చెందిన ఒక ఫ్రిగేట్‌తో సహా 9నౌకలను ముంచేసింది.