బంగారు తాపడం చేసిన ఆలయాల్ని ఇప్పటివరకూ చాలానే చూసుంటాం. మరి, సీలింగ్ నుంచి స్విమ్మింగ్ పూల్ అడుగు భాగం వరకూ బాత్‌టబ్ నుంచి ప్లేట్లూ స్పూన్ల వరకూ ఎటు చూసినా బంగారుమయమైన హోటల్‌ని ఎప్పుడైనా చూశారా…వియత్నాంలోని హాన్ రివర్, సన్ ట్రా పెనిన్సులా దగ్గర ఉన్న ఈ హోటల్ పేరుకి తగ్గట్లూ లోపల అడుగడుగునా బంగారపు ధగధగలే కనిపిస్తాయి. స్థానిక హొవా బిన్ గ్రీన్ కార్పొరేషన్ కంపెనీ మూడేళ్ల కిందట ప్రారంభించిన గోల్డెన్ బే హోటల్ మొత్తాన్నీ బంగారు రంగు థీమ్‌తో డిజైన్ చేశారు మరి. అంటే ఏదో మామూలు పసుపు వర్ణంతో హోటల్ మొత్తానికీ రంగు వేశారనుకుంటే పొరపాటే. అసలు సిసలు స్వర్ణాన్నే హోటల్ ప్రవేశ ద్వారం దగ్గరా లాబీల్లోని సీలింగ్‌కీ రిసెప్షన్ దగ్గర గోడకూ పూత పూశారట. ఈ హోటల్లోని కుర్చీలూ టేబుళ్లతో సహా గోడలకు అమర్చిన అలంకరణ వస్తువుల్లోనూ ఎక్కడా ఇనుము, స్టీలు లాంటి లోహాలు కనిపించవు. ఎందుకంటే… అవన్నీ బంగారపు మెరుగులతో ధగధగలాడుతుంటాయి. అంతేనా… 28 అంతస్తుల్లో ఉండే గోల్డెన్ బేలో ప్రతి అంతస్తులోనూ బాత్ రూమ్‌లో సింకులూ పంపు సెట్లూ పూర్తిగా బంగారంతో తాపడం చేసి ఉంటాయి. గోల్డెన్ బేలో ఉన్న నాలుగు ప్రెసిడెంట్ సూట్‌లైతే ఇంకా ప్రత్యేకం. వీటిలో సింకులూ పంపులతో పాటు, బాత్‌టబ్‌లూ సబ్బు పెట్టెలూ అద్దానికుండే ఫ్రేమ్‌లూ ఆఖరికి కమోడ్‌లు కూడా 24 క్యారెట్ల బంగారు పూతతో విలాసానికి ప్రతీకగా కనిపిస్తాయి. ఈ సూట్‌లో అతిథులకు భోజనం వడ్డించే డైనింగ్ టేబుల్ మీద ఉండే స్పూన్లూ ప్లేట్లూ గిన్నెలూ ఫోర్కుల్లాంటివి కూడా స్వర్ణ కాంతుల్ని వెదజల్లుతుంటాయి. ఇక, హోటల్ పై అంతస్తులో ఉన్న ఈతకొలను మరో వింత. డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చన్నట్లూ ఈ స్విమ్మింగ్ పూల్ అడుగుభాగానికీ బంగారు పూత వేయించేశారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన, పెద్దదైన 24 క్యారెట్ల బంగారు ఇన్‌ఫినిటీ స్విమ్మింగ్‌పూల్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. మిగిలినవాటికి బంగారు తాపడం చేయించారంటే ఓకే కానీ బాత్‌రూమ్‌కి ఎందుకూ… అనిపిస్తోంది కదూ… అదేమాట ఆ హోటల్ యాజమాన్యం దగ్గర అంటే ఎవరైనా మిగిలిన సమయంలో ఎంత బిజీగా ఒత్తిడితో ఉన్నా స్నానం చేసేటపుడు అవన్నీ దూరమైపోతాయి. అందుకే, చాలామందికి మంచి మంచి ఐడియాలు బాత్‌రూమ్‌లోనే వస్తుంటాయి. అందుకే, మేం స్నానాలగదిని విలాసవంతంగా మార్చాం అంటారు. ఏమైనా పుత్తడి ప్లేట్లలో తినడం, బంగారు బాత్‌టబ్‌లో స్నానం చెయ్యడం, స్వర్ణకాంతులీనే నీటిలో జలకాలాడటం అద్భుతమైన అనుభూతే కదా!
ఈ హోటల్…బాంగరం గానూ!
Related tags :