సోషల్‌మీడియాలో సందేశాలు చేసే ప్రతి ఒక్కరికీ రిప్లై ఇవ్వడం తన పనికాదని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. అభిమానినంటూ ఓ నెటిజన్ తనకు చేసిన సందేశాల్ని చిన్మయి ట్విటర్‌లో షేర్ చేశారు. అభిమాని ఆమెకు అసభ్యకర పదజాలంతో సందేశాలు చేశారు. చివరిల్లో ఇలా మాట్లాడితే రిప్లై ఇస్తారని ఆశించానని అన్నారు. ఆ సందేశాల్ని చిన్మయి స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేస్తూ.. రిప్లై ఇవ్వకపోతే అభిమాని ఇలాంటి మెసేజ్‌లు చేస్తాడా? అని ట్వీట్ చేశారు. దీన్ని చూసిన మరో నెటిజన్ చిన్మయిని విమర్శించారు. ‘ఓ ఫ్యాన్‌కు చిరాకు వచ్చే వరకూ ఎదురుచూసి, తర్వాత ఆ మెసేజ్‌లను షేర్ చేసేందుకు మీకు సమయం ఉంది. కానీ హాయ్.. థాంక్యూ అని రిప్లై ఇవ్వడానికి సమయం లేదా’ అని ప్రశ్నించారు. దీనికి చిన్మయి స్పందిస్తూ.. ‘నాకు రోజుకు వెయ్యి మెసేజ్‌లు వస్తాయి. ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరికీ రిప్లై ఇవ్వడం నా పనికాదు’ అని అన్నారు. మరోపక్క ‘మన్మథుడు 2’ టీజర్‌ను షేర్ చేసినందుకు కూడా చిన్మయిపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అందులో నాగ్‌కు, కొంత మంది అమ్మాయిలకు మధ్య ప్రేమ సన్నివేశాల్ని చూపించారు. కాగా తన భర్త రాహుల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో చిన్మయి ట్విటర్‌లో టీజర్‌ను షేర్ చేశారు. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. ‘మీటూ’ ఉద్యమం నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై పోరాడిన ఆమె ఇప్పుడు ప్రచారం, స్వార్థం కోసం ఇలాంటి టీజర్‌ను షేర్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇలా తన భార్య చిన్మయిపై విమర్శలు వెల్లువెత్తడంతో రాహుల్ స్పందించారు. పూర్తి సినిమా చూసిన తర్వాత మాట్లాడండని హితవు పలికారు.
రోజుకి వెయ్యి మందితో నా వల్ల కాదు
Related tags :