Business

నేను ఓడిపోతే స్టాక్ మార్కెట్లు పతనమవుతాయి

Trump warns American stock markets will collapse if he doesnt win 2020 elections

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 2.0 లక్ష్యంతో 2020 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రచారానికి మరింత పదును పెట్టారు. తాను మళ్లీ ఎన్నిక కాకపోతే స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవుతాయని తనదైన శైలిలో ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు. ఆయన ట్విటర్‌కు 61 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్‌ 2020 ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం అధికారికంగా ఆర్లాండో, ఫ్లోరిడాలో ప్రారంభించనున్నారు. మంగళవారం చాలా మంది వస్తారు.. చాలా ముఖ్యమైన రోజు అని ట్వీట్‌చేశారు.
‘‘ట్రంప్‌ ఆర్థిక వ్యవస్థ రికార్డులు సృష్టిస్తోంది. అది ఇంకా చాలా పైకి వెళ్లాల్సి ఉంది. 2020లో ఎవరైనా నన్ను ఓడిస్తే(పోటీ తీవ్రంగా ఉంది) మార్కెట్‌ కుప్పకూలడం ఖాయం. అదికూడా అమెరికా గతంలో ఎన్నడూ చూడనంతగా ఉంటుంది. కీప్‌ అమెరికా గ్రేట్‌’’ అని ట్వీట్‌ చేశారు.
ఇటీవల మార్కెట్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలు..
• శుక్రవారం కూడా ‘ఫాక్స్‌ అండ్‌ ఫ్రెండ్స్‌’ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ‘‘గత ఏడాది ఫెడ్‌ వడ్డీరేట్లను నాలుగుసార్లు పెంచకపోతే మార్కెట్‌ మరో 5వేల నుంచి 10వేల పాయింట్లు పెరిగి ఉండేది’’ అని తెలిపారు.
• ‘‘2016లో ప్రత్యర్థులు గెలిచి ఉంటే మార్కెట్‌ 5వేల నుంచి 10 వేల పాయింట్లు పడిపోయేది.’’ అని ట్వీట్‌ చేశారు.
• జనవరలో మాట్లాడుతూ ‘‘మీకు స్టాక్‌ మార్కెట్‌ క్రాష్‌ చూడాలంటే.. ట్రంప్‌ను తొలగించండి’’ అని వ్యాఖ్యానించారు.