Business

గన్నవరం నుండి నెలాఖరు వరకే సింగపూర్ విమానం

VGA To Singapore To Stop By June End

గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను 2017 మే 3న కేంద్రం ప్రకటించింది. సరిగ్గా ఆరు నెలల్లో ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమవుతాయని ప్రకటించారు. కానీ.. ఏడాదిన్నర దాటినా అంతర్జాతీయం ఊసే లేదు. 2018 డిసెంబర్‌ 4న గన్నవరం నుంచి సింగపూర్‌కు మొదటి సర్వీసు గాలిలోకి లేచింది. అంతర్జాతీయ సర్వీసుల కోసం విమానాశ్రయంలోని పాత టెర్మినల్‌ భవనాన్ని కేవలం రెండు నెలల వ్యవధిలోనే అన్ని సౌకర్యాలతో ఆధునికీకరించారు. అన్ని విభాగాలకు అవసరమైన ఏర్పాట్లూ చకచకా చేశారు. పలురకాల అనుమతుల ప్రక్రియ తీవ్ర జాప్యం అవ్వడంతో.. ఏడాదిన్నర పూర్తయినా.. ఒక్క సర్వీసూ గాలిలోకి లేవలేదు. చివరికి ఏం చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌) పద్ధతిలో ఇండిగోతో ఒప్పందం చేసుకుని వారంలో రెండు సర్వీసులను సింగపూర్‌కు ఆరంభించింది. ఈనెలాఖరుతో ఇండిగోతో కుదుర్చుకున్న ఒప్పందం ముగుస్తున్నందున ఉన్న ఒక్క అంతర్జాతీయ సర్వీసు ఆగిపోతుందో.. లేక కొనసాగుతుందో.. తెలియని సందిగ్ధం ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలను సైతం జూన్‌ నెలాఖరుతోనే ఇండిగో ఆపేసింది.గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు ప్రస్తుతం ఆగిపోతే.. మళ్లీ పునరుద్ధరించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అవసరమైన మౌలికసౌరక్యాల ఏర్పాటు కోసం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) రూ.4 కోట్ల వరకూ వెచ్చించి టెర్మినల్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం దీనిలో కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ విభాగాలు, ఏపీ పోలీసులు, విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు బ్యాంకు శాఖలు ఉన్నాయి. అత్యాధునిక భద్రతా వ్యవస్థ, సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నడుస్తున్న ఏకైక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగిపోతే విమానాశ్రయానికి సైతం భారం తప్పదు. కస్టమ్స్‌ విభాగానికి నెలకు రూ.20లక్షల వరకూ చెల్లిస్తున్నారు. రాష్ట్ర పోలీసులకు ఇమ్మిగ్రేషన్‌ విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి.. వారి సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్‌ సర్వీసు ఆగిపోతే వీటన్నింటినీ కొనసాగించేందుకు అవకాశం ఉండదు.అనుమతులతో తీవ్ర జాప్యం.. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కేంద్రం ప్రకటించిన తర్వాత అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. విమానాశ్రయంలో అంతా సిద్ధమైన తర్వాత కూడా ఏడాదిన్నర వరకూ సర్వీసులు ఆరంభమవ్వలేదు. టెర్మినల్‌ భవనం సిద్ధమయ్యాక డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) అనుమతుల ప్రక్రియకు కొంత సమయం పట్టింది. అవన్నీ పూర్తయ్యాక కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ విభాగాల ఏర్పాటులో జాప్యం జరిగింది. ఇవన్నీ పూర్తయ్యాయనుకుంటే.. విమానయాన సంస్థలు సర్వీసులను నడిపేందుకు ముందుకురాలేదు. దీంతో మరికొంత ఆలస్యమైంది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కనీసం ఒక్క దేశానికైనా విమాన సర్వీసులను తొలుత ఆరంభించాలని ప్రయత్నాలు చేసింది. సింగపూర్‌కు సర్వీసులు నడిపేందుకు.. వీజీఎఫ్‌ విధానంలో విమానయాన సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించి.. ఇండిగోను ఎంపిక చేశారు. ఏడు నెలలకు ఒప్పందం చేసుకోవడంతో ఈనెలాఖరుతో ముగుస్తోంది. తర్వాత పరిస్థితి ఏంటనేది.. ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం.. లేక కొత్తగా మళ్లీ కుదుర్చుకోవడం చేస్తేనే.. జులై నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.