నైరుతి పవనాలు సాధారణంగా కేరళలోనే మొదలవుతాయని మనకు తెలుసు కదా! 2001 జులై 19న కూడా అలాగే ప్రారంభమయ్యాయి. కానీ అలా మొదలైన కొన్ని నిమిషాలకే వాన నీటి రంగు కాస్త గులాబీకీ… తరవాత ఏకంగా ఎరుపుకీ తిరిగింది. ఆ నీళ్లు పడ్డ దుస్తులు కూడా రక్తపు మరకలైనట్టు మారిపోయాయి. కేరళ సముద్ర తీరప్రాంతంలోని ఇడుక్కి, కొట్టాయం ప్రాంతంలో ఇరవై నిమిషాలపాటు ఇలా ఎర్రటివాన కురవడంతో ప్రజలు బెంబేలెత్తారు. దేవతలు కన్నెర్రచేశారన్నారు. కొందరేమో గ్రహాంతరవాసులొచ్చారని ప్రచారానికి దిగారు. చూస్తుండగానే ‘అదిగో పులి అంటే ఇదిగో తోక…’ బాపతు కథలెన్నో వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేశాయి. ఆ రకంగా ఒక్కసారి కాదు, జులై నుంచి సెప్టెంబర్ దాకా అక్కడక్కడా ఇలాంటి వర్షం పడుతూనే ఉంది. అప్పుడు కేరళలోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ సంస్థ రంగంలోకి దిగి… ఆ ఎర్రటి వర్షపు నీళ్లని పరీక్షించి రక్తంకాదని తేల్చింది. ట్రెంటేఫేలియా అనే నాచుమొక్క రేణువులు మేఘాలతో కలవడం ఇందుకు కారణమని చెప్పింది. కానీ ట్రెంటేఫేలియా నాచు కేరళలో లేదు… అది ఆస్ట్రియా దేశంలో కనిపిస్తుంది. మరి దాని రేణువులు కేరళకి ఎలా వచ్చాయన్న ప్రశ్నకి చాలారోజుల తరవాత సమాధానం దొరికింది. ‘క్లౌడ్స్ ఓవర్ ఓషన్’ (మహాసముద్రాల మేఘాలు) అనే ప్రక్రియ ద్వారా సూక్ష్మజీవులు ఇలా మేఘాల ద్వారా దేశం విడిచి వేరే దేశాలు చేరడం మామూలేనని తేల్చారు. గతంలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి ఇలా తీరాలు దాటి వచ్చిన సందర్భాలున్నాయికానీ నాచు మొక్క ఇలా రావడం ఇదే మొదటిసారని తేల్చారు! దానిపైన పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ రకంగా మన కేరళ నెత్తుటి వాన సరికొత్త శాస్త్ర పరిశోధనకి నాంది పలికింది!
కేరళలో రక్తపు వాన
Related tags :