DailyDose

ప్రారంభమైన 17వ లోక్‌సభ సమావేశాలు-రాజకీయం-06/17

17th Loksabha Begins In India-June 17 2019-Daily Political News

* ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు. కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారిని, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదు. రూ.15 లక్షల కంటే తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట. ముంబై దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారు.
*బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి, జగ్గారెడ్డి?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగవంతం చేసింది బీజేపీ. ప్రధానంగా కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేసింది కమలదళం. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని పార్టీలో తీసుకునేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు చేసినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన కాంగ్రెస్ ‌నాయకత్వంపై చేసిన విమర్శలే నిదర్శనమంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సమర్ధవంతమైన రాష్ట్ర నాయకత్వం లేకపోవటంలో కాంగ్రెస్ పరిస్తితి దిగజారిపోతుందని విమర్శించారు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి. కేసీఆర్ తో ఫైట్ చేయాలంటే కేవలం డబ్బే కాదని.. బీజేపీ లాంటి పార్టీ కూడా అవసరమంటున్నారాయన.
* రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదని, టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్యలు తీసుకుంటుందా? ఆయనకు షోకాజ్‌ నోటీసలు ఇవ్వనుందా? ఇదే అంశంపై ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి వాఖ్యలపై అటు కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రనాయకత్వానికి సైతం ఆయనపై ఉదాసీనంగా ఉండాల్సిన అవసరం లేదంటూ హైకమాండ్‌ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అయితే.. దీనిపై ఆచీతూచీ అడుగులు వేయాలని నిర్ణయించారు టీ కాంగ్రెస్‌ నేతలు.
* జగన్ పనితీరు చేతల్లో కన్పించడం లేదు: హర్షకుమార్‌
వైసీపీ ప్రభుత్వం కూడా దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్‌ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులంతా కంకణం కట్టుకుని జగన్‌ను సీఎం చేశారన్నారు. జగన్ పనితీరు చేతల్లో కన్పించడం లేదన్నారు. రంగంపేట మండలం సింగంపల్లిలో దళితుడిని పంచాయతీ కార్యాలయంలో అత్యంత కిరాతకంగా హత్య చేసిన దళితుడి హత్యకేసులో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. మామిడికాయలు కోసినందుకే దళితుడిని పంచాయతీ కార్యాలయంలో హత్య చేసి ఉరితీశారని, ఈ సంఘటనపై సీఎం జగన్‌ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
* రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్‌?
ఈ నెల 19వ తేదీన నిర్వహించబోయే అఖిలపక్ష భేటీ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన నిగూఢ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. ‘ఒక దేశం.. ఒకసారి ఎన్నికలు’ (వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌)తో పలు కీలక అంశాలను చర్చించేందుకు బుధవారం (19న) అఖిలపక్ష భేటీని నిర్వహించాలని నరేంద్రమోదీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
* వైయస్‌ జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ వైయస్‌ జగన్‌ను ఆహ్వానించారు. విభజన సమస్యలపై వైయస్‌ జగన్‌తో కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది. వైయస్‌ జగన్‌ నివాసంలో కేసీఆర్‌ బృందం లంచ్‌ చేయనుంది. కేసీఆర్‌ వెంట కేటీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.
* కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వీహెచ్‌ ఆగ్రహం
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ ఎన్నో పదవులు ఇచ్చిందని అన్నారు. గెలిస్తే తమ గొప్ప.. ఓడితే పార్టీ నాయకత్వలోపం అనడం సరికాదని వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్‌ల కోసమే అధికార పార్టీలోకి వెళ్తున్నారని వీహెచ్‌ విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పార్టీలో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందని, చుట్టూ ఉన్నవారు రాహుల్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్నారని హనుమంతరావు విమర్శించారు.
* యూపీ సీఎం యోగికి మోదీ ఆదేశాలు
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీజేపీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు సోమవారం లేఖ రాశారు. ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి తీవ్ర నీటి ఎద్దడితో రాష్ట్ర ప్రజలు సతమతవుతున్నారని, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నందున ఆ సమస్యను వెంటనే పరిష్కారించాలని మోదీ సూచించారు. యూపీలోని వెనుకబడిన బుంధేల్‌ఖడ్‌, విద్యాంచల్‌ వంటి ప్రాంతాల్లో నీటి సమస్యతోపాటు మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని మోదీ వివరించారు. రానున్న రెండేళ్లలో వీటన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
* 17వ లోక్‌సభ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.
సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భాజపా ఎంపీ వీరేంద్రకుమార్‌ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ హోదాలో వీరేంద్రకుమార్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.సోమ, మంగళవారాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. తొలుత ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రులు, ప్యానల్‌ ఛైర్మన్లు ఎంపీలుగా ప్రమాణం చేయనుండగా, ఆ తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు.ఎంపీల్లో మొదట అండమాన్‌ నికోబార్‌ ఎంపీ.. ఆ తర్వాత రెండో స్థానంలో ఏపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నియోజకవర్గాల క్రమసంఖ్య ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఏపీ నుంచి తొలుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
* మీలో మార్పు రాకపోతే తట్టుకోలేరు..- అంబటి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన అంబటి.. దేశంలో చక్రాలు తిప్పిన చంద్రబాబు లాంటి సీనియర్‌ నాయకుడికి కూడా అందని అనూహ్య విజయాన్నిప్రజలు వైసీపీకి కట్టబెట్టారన్నారు. 151 సీట్లు వచ్చాయని విజయ గర్వంతో మత్తు ఎక్కలేదన్నారు. ఐదేళ్ల క్రితం చంద్రబాబు బెల్ట్‌షాపుల రద్దుపై మొదటి సంతకాన్ని చేశారని… అయితే ఆ సంతకాన్ని ఐదేళ్ల అనంతరం వైసీపీ అధినేత సీఎం అయిన తర్వాత వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. బెల్ట్‌షాపులనే రద్దు చేయలేని టీడీపీ ప్రభుత్వం ఎలాంటి పాలన చేసిందో ప్రజలు గత చూశారన్నారు.
* విభజన హామీలు అమలు చేయాలి
ఉమ్మడి రాష్ట్ర పునర్విభజన బిల్లులో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. దిల్లీలో ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ నేతల అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం ఆయన తెరాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బిల్లులు పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పామన్నారు.
*రోజూ వంద ఫోన్లు వస్తున్నాయ్
తెదేపా, కాంగ్రెస్ నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని.. రోజూ వంద ఫోన్లు వస్తున్నాయని, త్వరలో భాజపాలోకి భారీగా చేరికలుంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. నాయకులను దఫదఫాలుగా చేర్చుకుంటామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహా ఎవరినైనా స్వాగతిస్తామని చెప్పారు. తెలంగాణలో తెరాసను ఎదుర్కొనే సత్తా భాజపాకే ఉందని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు.
*కాళేశ్వరంపై శ్వేతపత్రం విడుదల చేయండి
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని తాజా మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్)ఎమ్మెల్యేలందరికీ అందజేయాలని కోరారు. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? ఎంత మేర పనులు పూర్తయ్యాయి? మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని నిధులు కావాలి? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లిస్తారు? తదితర వివరాలను ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.
*కాంగ్రెస్లో ‘రాజగోపాల్’ కలకలం
‘తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే’ అంటూ మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి, సీఎల్పీని తెరాసఎల్పీలో విలీనం చేయడంతో దెబ్బతిన్న టీపీసీసీకి రాజగోపాల్రెడ్డి తీరు మరింత ఇబ్బందికరంగా మారింది. పార్టీ మారుతున్నట్లు పరోక్షంగా ప్రకటించిన ఆయనపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ శ్రేణుల్లో నెలకొంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమాచారం.
*పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి
వడ్డెర్లంతా సంఘటితమై తమ కులమనే తుపాకీని రాజ్యాధికారంపై ఎక్కుపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారన్నారు. వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ‘జాతీయ వడ్డెర్ల మహాగర్జన’ నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచు ఎన్నికల్లో గెలుపొందిన వడ్డెర సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను సత్కరించారు.
*మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట
మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి త్వరలో రాష్ట్రస్థాయిలో ఒక టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేస్తామని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. పోలీసుస్టేషన్కు వెళ్లి తమ కష్టాన్ని చెప్పుకోవటానికి ఇబ్బందిపడే మహిళలు ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చని సూచించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయం రెండో బ్లాకులో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆదివారం హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
*కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వస్తే వై.ఎస్.ఆత్మ క్షోభిస్తుంది: జగన్కు భట్టి లేఖ
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావొద్దంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్కు తెలంగాణ తాజా మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం లేఖ రాశారు. ‘తెలంగాణను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి, పేరు మార్చి, పునరాకృతి పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది. ప్రారంభోత్సవానికి వస్తే రాజశేఖర్రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది. కేసీఆర్ అవినీతిని సమర్థించినట్లు అవుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు.
*దాడులు చేయడమే రాజన్న రాజ్యమా?: లోకేశ్
‘వైకాపా అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల వ్యవధిలోనే వంద మందికిపైగా తెదేపా కార్యకర్తలపై దాడులు చేశారు. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం?’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆదివారం ట్విటర్ వేదికగా వైకాపా నేతలను ప్రశ్నించారు. దాడులు, దౌర్జన్యాలతో తెదేపా శ్రేణుల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన హెచ్చరించారు. ‘గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో తెదేపాకు ఓటేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేశారు. నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదల గుడిసెలు కూల్చడానికి యత్నించారు’ అంటూ ప్రస్తావించారు. పోలీసు యంత్రాంగం తక్షణమే ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
*మాదిగల ఆత్మగౌరవ జాతరకు హాజరుకండి
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రకాశం జిల్లా ఈదుముడిలో నిర్వహించనున్న ఆత్మగౌరవ జాతరకు హాజరుకావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం దిల్లీలో ఏచూరిని ఆయన కలిశారు. మాదిగల ఆత్మగౌరవ జాతరను జులై 7వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. 25 ఏళ్ల ఎమ్మార్పీఎస్ పోరాటంతో మాదిగల్లో వచ్చిన చైతన్యం తదితర అంశాలను సీతారాం ఏచూరికి ఆయన వివరించారు. మందకృష్ణ మాదిగ వెంట నేతలు తీగల ప్రదీప్ గౌడ్, నవీన్, ఆశీష్ ఉన్నారు.
*కర్ణాటకలో కమలనాథుల ఉద్యమ దూకుడు
సంకీర్ణ సర్కారు పనితీరుకు వ్యతిరేకంగా కర్ణాటకలో భాజపా కదం తొక్కుతోంది. వివిధ డిమాండ్లు పరిష్కరించాలంటూ శుక్రవారం నుంచి కొనసాగిస్తున్న నిరవధిక ధర్నా కార్యక్రమం ఆదివారం తీవ్రరూపం దాల్చింది. పార్టీ నేతలు, కార్యకర్తలు మూకుమ్మడిగా ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. బళ్లారి జిల్లాలో జిందాల్ ఉక్కు సంస్థకు నామమాత్రపు ధరకే 3667 ఎకరాల భూమిని విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భాజపా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో కరవు సహాయ పనుల్లో అలసత్వం, తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి కుమారస్వామి నివాస కార్యాలయాన్ని పార్టీ నేతలు ఆదివారం ముట్టడించాలని నిర్ణయించారు.
*బలమైన శక్తిగా భాజపా
తెలుగు రాష్ట్రాల్లో భాజపా బలమైన శక్తిగా అవతరించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్, ఒడిశా, కేరళ, తెలంగాణలతోపాటు ఏపీలోనూ భాజపా బలపడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ దిశగా తాము ఉద్యమ స్థాయిలో పనిచేయబోతున్నామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత దక్షిణాదిలో పార్టీకి అనుకూల వాతావరణం మరింత పెరిగిందని వివరించారు. పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసే కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.