అమ్మ కావడం ఓ వరం. గర్భిణిగా తొమ్మిది నెలల్లో ఎన్నో సందేహాలు, భయాలు. ప్రసవం అయ్యాక పాపాయి సంరక్షణలో తలెత్తే ప్రశ్నలు… ఇవన్నీ గుర్తించే ‘ఐ లవ్ నైన్ మంత్స్’ స్టార్టప్‌ను ప్రారంభించారు లాక్టేషన్ ఎడ్యుకేటర్ అంజలీరాజ్, ఫిట్‌నెస్ నిపుణురాలు గంగారాజ్, వైద్యురాలు సుమా అజిత్. ఇటీవలే గర్భిణుల కోసం ప్రెగ్గో యాప్‌నీ అందుబాటులోకి తెచ్చారు. గంగా రాజ్ స్వస్థలం కేరళలోని కొల్లం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో ఫిట్‌నెస్ నిపుణురాలిగా పని చేస్తున్నారు. ఆమె కూతురే అంజలీ రాజ్. ఆస్ట్రేలియాలోని వార్విక్ మెడికల్ స్కూల్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. లామేజ్, లాక్టేషన్ ఎడ్యుకేటర్ అయిన అంజలీదే ‘ఐ లవ్ నైన్ మంత్స్’ ఆలోచన. ఒక వ్యాపార సదస్సులో ఈ స్టార్టప్ ఆలోచనను పంచుకొని విజయం సాధించింది. దాన్ని తన తల్లి, ఆస్ట్రేలియాలోని వైద్య నిపుణురాలైన సుమా అజిత్‌తో కలిసి వ్యాపార ఆలోచనగా మార్చాలనుకుంది. మొదట బెంగళూరులో దీన్ని ప్రారంభించినా, కేరళ స్టార్టప్ మిషన్, కేఎస్‌డీసీ సంస్థలు ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించడంతో ఆ సంస్థను కేరళకు తరలించారు. ఈ స్టార్టప్‌లో ‘సహోదరి’ విభాగం ద్వారా గర్భిణులు, బాలింతలకు హోంకేర్ సేవలు అందిస్తున్నారు. గర్భిణులు సరైన బరువుతో ఉన్నారా, తీసుకోవాల్సిన ఆహారం, మానసిక ఆరోగ్యం… వంటివన్నింటినీ ఈ నిపుణుల బృందం పర్యవేక్షిస్తుంది. వీరు సులువైన వ్యాయామాలు నేర్పిస్తారు. ప్రసవం తరువాత పాలివ్వడంపైనా అవగాహన కల్పిస్తారు. పాపాయి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు చెబుతారు. ప్రస్తుతం కేరళలో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలో హైదరాబాద్‌కీ విస్తరించనున్నారు. ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకూ ఆమెకు కావాల్సిన సమాచారం మొత్తం అందిస్తుందీ స్టార్టప్. ఈ తొమ్మిది నెలల కాలంలో మహిళలు ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులు, సందేహాలు తీర్చడానికి గైనకాలజిస్ట్, లాక్టేషన్ స్పెషలిస్ట్, డైటీషన్ నిపుణులు కలిపి పదిమందితో కూడిన వైద్య బృందం అందుబాటులో ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర రిపోర్టులు ఈ యాప్‌లో నమోదు చేస్తే వైద్యులు వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్ చేసి సందేహాలు తీరుస్తారు. గర్భధారణకు సంబంధించిన ఎన్నో వ్యాసాలుంటాయి. ఈ యాప్ మొదటి వర్షన్ పూర్తి చేయడానికి వీరికి ఏడాది సమయం పట్టింది. ఇప్పుడు రెండో వర్షన్‌ని రెండు భాగాలుగా రూపొందించారు. ఇందులో ఒకటి ప్రెగ్గో. ఇది గర్భిణులకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. ఇటీవలే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఐ లవ్ నైన్ మంత్స్‌లో ఉన్న సౌకర్యాలన్నీ ఇందులోనూ ఉంటాయి. రెండోది కడిల్స్. బాలింతల అవసరం కోసం దీనిని రూపొందిస్తున్నారు. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ‘ఐ లవ్ నైన్ మంత్స్ మొదటి వర్షన్ యాప్‌ను ఎక్కువగా చిన్న పట్టణాలు, నగరాలకు చెందిన గర్భిణులు వినియోగించేవారు. తాజాగా తీసుకొచ్చిన ప్రెగ్గో యాప్ గర్భిణులకు అవసరమైన సమాచారాన్ని ఉచితంగా అందిస్తోంది. హోంకేర్ సర్వీసులు, బ్రెస్ట్ ఫీడింగ్, లాక్టేషన్ పాడ్‌ల నుంచి స్టార్టప్‌నకు ఆదాయం సమకూరుతోంది’ అని చెబుతోంది గంగారాజ్. జనసందోహం ఉన్నచోట పిల్లలకు పాలివ్వడం అంటే ఇబ్బందే. ఇది గమనించే రద్దీ ప్రదేశాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్‌లు ఏర్పాటు చేస్తోంది ఈ బృందం. మొదటి బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్‌ను త్రిశ్సూర్‌లోని రెస్టారెంట్‌లో ప్రారంభించారు. మంచి స్పందన రావడంతో ఇతర ప్రాంతాలకు విస్తరించారు. ఇందులో మహిళ సౌకర్యంగా కూర్చొని పాపాయికి పాలు పట్టొచ్చు. కార్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధానం నచ్చి కోచి మెట్రో వీరితో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ 16 స్టేషన్లలో ఈ పాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో కన్యాకుమారి నుంచి త్రిశ్సూర్ వరకూ ఉన్న అన్ని రైల్వే స్టేషన్లల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు.
అమ్మల కోసం ఒక యాప్-I Love 9 Months
Related tags :