హెచ్-4 వీసాదారుల పని అనుమతులను రద్దు చేయాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ విషయంలో నిబంధనల సవరింపు ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో తుది నిర్ణయానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు ఇచ్చేదే హెచ్-4 వీసా. హెచ్-4 వీసాతో పాటు అమెరికా పౌరసత్వం, వలసదారుల నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందని హోమ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. కేవలం ప్రతిభ ఆధారంగా పని వెసులుబాటు కల్పించడానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. అయితే ఈ క్రమంలో వచ్చే అన్నీ ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి చట్టాలకు లోబడి ఉన్న సలహాలను స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల హెచ్-4 వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి రక్షణగా కాలిఫోర్నియాకు చెందిన ఇద్దరు శాసనకర్తలు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. హెచ్-4వీసా పని అనుమతుల వల్ల అమెరికన్లు భారీగా నష్టపోతున్నారని.. నిబంధనలను మారుస్తామని ట్రంప్ సర్కార్ వాదిస్తూ వస్తోంది. తాజాగా అందుకనుగుణంగా నిబంధనలను త్వరలోనే మార్చనున్నామని డీహెచ్‌ఎస్ ప్రకటించడంతో.. అనేక మంది విదేశీయులు ఆందోళనకు గురవుతున్నారు. హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలో ఉపాధి పొందుతున్న వారిలో భారతీయులు గణనీయ సంఖ్యలో ఉండడం గమనార్హం. హెచ్-1బీ వీసా ద్వారా అమెరికా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారి కుటుంబాల ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారి జీవితభాగస్వాములైన హెచ్-4వీసాదారులకు పని అనుమతి కల్పించిందని పలువురు శాసనకర్తలు గుర్తుచేశారు. హెచ్-4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరిట ఒబామా హయాంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
H4EAD వారికి శుభవార్త
Related tags :