Editorials

హాంగ్‌కాంగ్ ప్రజలు ఎందుకు నిరసన చేస్తున్నారో తెలుసా?

Here is the story and reasons why Hong Kong is protesting

నాయకులు లేరు.. ఉపన్యాసాలు లేవు.. కానీ, వీధుల్లో ఉద్యమ తరంగాలు ఎగసిపడ్డాయి. ఈ ఊపు చూసి తన పదవికి ఎసరొచ్చిందని ఆ దేశాధినేతకు అర్థమై ఏడ్చేసింది..! లెంపలేసుకొని తప్పు సరిదిద్దుకుంటానని బేలగా చెప్పింది. ఇదంతా స్వేచ్ఛాపిపాసులైన హాంకాంగ్‌ యువత ముందుండి నడిపించిన ఉద్యమం ఫలితం. హాంకాంగ్‌ ప్రజలు ఇంతగా ఎందుకు స్పందిచారు.. ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో చూస్తే చైనా పాలకులు చేసే పనులు అర్థమవుతాయి. హాంకాంగ్‌లో నేరస్థులను చైనాకు అప్పగించాలంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు తారస్థాయిలో ఉద్యమించారు. ఒక్క ఆదివారమే 20 లక్షల మంది వీధుల్లోకి వచ్చారంటే ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వీరంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. విద్యార్థి బృందాలు, రాజకీయ నాయకులు, ఎన్‌జీవోలు, లేబర్‌ యూనియన్‌లు, ఉపాధ్యాయులు ఇలా అన్ని వర్గాలు ఉద్యమానికి సాయం చేశాయి. దీంతో ఈ బిల్లును వాపస్‌ తీసుకొంటున్నట్లు హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెర్రిలామ్‌ ప్రకటించారు. ఆమె ఒక దశలో ఈ ఉద్యమాన్ని చూసి భయపడిపోయి ఏడ్చేశారు. బిల్లును బుట్టదాఖలు చేసే దాకా ఉద్యమం కొనసాగుతుందని ఉద్యమకారులు చెబుతున్నారు. వారి భయానికి కారణం ఉంది. దేశ చట్టసభలోని 70 సీట్లలో 43 బీజింగ్‌కు అనుకూలురే ఉన్నారు. ఈ బిల్లును మరెప్పుడైనా ఆగమేఘాల మీద చట్టసభలో పాస్‌ చేస్తే.. ఆ ఫలితాన్ని హాంకాంగ్‌ వాసులు అనుభవించాల్సిందే. మరోపక్క ఈ ఉద్యమం ఇప్పుడు పెరిగి పెద్దదైతే 2047లో సమస్యలు సృష్టిస్తుందేమోనని బీజింగ్‌ ఆందోళన చెందుతోంది. అసలు హాంకాంగ్‌ నేరస్థులను చైనాకు ఎందుకు అప్పగించాలి. దీనిని ప్రజలు ఎందుకు వ్యతిరేస్తున్నారు..? ఇక్కడ ఉద్యమంపై బీజింగ్‌ ఎందుకంత అసహనంగా ఫీలవుతోందో తెలుసుకోవాలంటే చరిత్రను తిరగేయాల్సిందే. బ్రిటిష్‌ వారికి చైనాకు మధ్య నల్లమందు యుద్ధాలు చోటు చేసుకొన్నాయి. దీనిలో బ్రిటీష్‌వారు చైనాను ఓడించి హాంకాంగ్‌ను 1842లో వశం చేసుకొన్నారు. ఆ తర్వాత ఇది జపాన్‌ చేతిలోకి వెళ్లింది. మళ్లీ 1945లో బ్రిటన్‌ దీనిని స్వాధీనం చేసుకొంది. 1997లో బ్రిటన్‌ హాంకాంగ్‌ను చైనాకు అప్పగించింది. కానీ, ఒక దేశం రెండు విధానాలు అనే సూత్రం ప్రకారం ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. 2047 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ఇక 1200 మంది సభ్యులు ఉన్న ఎన్నికల కమిటీ ప్రభుత్వాధినేత అయిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకొంటుంది. ఈ కమిటీ హాంకాంగ్‌లోని 6శాతం మంది ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో చాలా సీట్లకు ఎన్నికలు ఉండవు. చైనాకు అనుకూలమైన వ్యక్తులే దీనిలో ఉంటారు. ప్రస్తుత చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కూడా ప్రస్తుత చైనా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అనే ముద్ర ఉంది. చైనాకు, హాంకాంగ్‌ మధ్య వ్యాపార సంబంధాలు విడదీయలేనంతగా ఉన్నాయి. చైనాలో 2012లో షీజిన్‌పింగ్‌ ప్రభుత్వం అధికారం చేపట్టాక నియంతృత్వ ధోరణి పెరిగిపోయింది. ఆయనకు మరో కమ్యూనిస్టు నేత జియాంగ్‌ జెమిన్‌తో కొంత వర్గపోరు ఉంది. అందుకే 2012లో అధికారం చేపట్టగానే జెమిన్‌ వర్గానికి చెందిన నాయకులు, అధికారులను అవినీతిపరుల పేరుతో జైళ్లలో వేశారు. హాంకాంగ్‌లోని వ్యాపారవేత్తలు, నాయకుల్లో జమిన్‌ అనుకూలురు ఇంకా ఉన్నారు. వీరి నుంచి ఎప్పటికైనా ముప్పు ఉంటుందని భావించిన షీజిన్‌పింగ్‌ అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నేరగాళ్ల అప్పగింత బిల్లును తెరపైకి తెచ్చారు. అంతేకాదు, ఇప్పటికే చాలా మంది హాంకాంగ్‌ వాసులు తమను చైనీయులుగా భావించరు. ఈ క్రమంలో 2047 వరకు అక్కడ ప్రజా స్వామ్యం ఉంటే ఆ తర్వాత అది చైనాలో విలీనం అయ్యేందుకు అంగీకరించకపోవచ్చనే అనుమానాలు కూడా డ్రాగన్‌లో ఉన్నాయి. అందుకే ఇక్కడ ప్రజస్వామ్య ఉద్యమకారులను లక్ష్యంగా చేసుకొనేందుకు కూడా ఈ బిల్లును ఉపయోగించనున్నారు. ఇప్పటికే 2014లో ప్రజాస్వామ్యం కోసం భారీఎత్తున అంబ్రెల్లా ఉద్యమం జరిగింది. దీంతో హాంకాంగ్‌లో స్వతహాగా ఉన్న ప్రజాస్వామ్య చట్టాలను నీరుగార్చి కమ్యూనిస్టు ప్రభుత్వ చట్టాలను పోలిన వాటిని అమలు చేయాలని డ్రాగన్‌ భావిస్తోంది. కొత్త బిల్లు ప్రకారం హాంకాంగ్‌తో నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోయినా.. ఆయా దేశాలు కోరిన నేరగాళ్లను అరెస్టు చేసి అప్పగించవచ్చు. ఈ బిల్లు ప్రకారం చైనా, తైవాన్లకు కూడా నేరస్థులను అప్పగించే అవకాశం ఉంది. ఈ బిల్లు తెచ్చేందుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెర్రీలామ్‌ చెప్పిన కారణం ఆశ్చర్యకరంగా ఉంది. తన స్నేహితురాలిని చంపిన ఒక హాంకాంగ్‌ వ్యక్తిని అత్యవసరంగా తైవాన్‌లో విచారించాలని.. అందుకే ఈ బిల్లును ఆగమేఘాల మీద తెరపైకి తెచ్చినట్లు సెలవిచ్చారు. కానీ, అక్కడి ప్రజలకు విషయం అర్థమైంది. ప్రజాస్వామ్య ఉద్యమకారులను, రాజకీయ నాయకులను చైనా ప్రధాన భూభాగంపైకి తరలించేందుకే ఈ నాటకాలు ఆడుతున్నట్లు గుర్తించి వీధులకెక్కి ఉద్యమించారు. అప్పగింతకు వీలైన మొత్తం 37 నేరాలను ఈ బిల్లులో పొందుపర్చారు. పైగా చైనా అభ్యర్థనలను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆమోదించాలని, హాంకాంగ్‌ కోర్టు ధ్రువీకరించాలని బిల్లులో పేర్కొన్నారు. అనుబంధ ప్రభుత్వంగా ఉన్న చోట బీజింగ్‌ మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయరు. చైనాకు ఒకసారి వెళ్లారంటే తిరిగి రావడం కష్టం. అక్కడ ఎటువంటి కారణం చెప్పకుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పైనే ఏళ్లకొద్దీ జైళ్లలో మగ్గుతున్నవారు కొన్నిలక్షమంది ఉన్నారు. ఫలూంగాంగ్‌ సాధకులే దీనికి ఉదాహరణ.