*బాసరలో మూడు రోజుల్లో రూ.40 లక్షలు పీల్చేశారు
*మరో రూ.10 లక్షల సామగ్రి మహారాష్ట్రలో కొన్నట్లు సృష్టి
చదువుల తల్లి సరస్వతీ దేవి ఆలయ సన్నిధిలో అవినీతికి అంతు లేకుండా పోతోంది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు అవినీతి తమ నిత్యకృత్యంగా మార్చుకున్నారు. నిర్మల్ జిల్లాలో వెలిసిన బాసర సరస్వతీ ఆలయానికి సంబంధించిన మిగులు నిధులను ఖర్చు చేసినట్లు చూపి ఏకంగా రూ.40 లక్షలు కాజేశారు.. మహారాష్ట్ర దుకాణాల్లో సామగ్రి కొన్నట్లు మరో రూ.10 లక్షలు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. బాసర ఆలయానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఖర్చుల కోసం కేటాయించిన బడ్జెట్లో అరకోటికి పైగా నిధులు మిగిలాయి. ఆ సమయంలోనే ఆలయానికి కొత్త ఈవో నియమితులయ్యారు. ఇదే అదనుగా ఓ ఉద్యోగి మిగులు నిధులను కాజేయడానికి పథకాన్ని రచించారు. ఇందులో ఆలయంలోని ఓ ఉన్నతాధికారిని భాగస్వామిగా చేశారు.ఎలాంటి కొనుగోళ్లు జరపకున్నా ఆలయ అవసరాల కోసం పలు వస్తువులు కొన్నట్లుగా దొంగ బిల్లులు సృష్టించారు. సుమారు 20 చెక్కుల ద్వారా ఆయా దుకాణాలకు నగదు చెల్లింపులు జరిపినట్లు రిజిస్టరులో నమోదు చేశారు. ఫర్నిచర్, డోర్ కర్టెన్లు, దుప్పట్లు, ఏసీలు, పారిశుద్ధ్య సామగ్రి, జ్ఞాపికలు కొనుగోలు చేసినట్లు నిజామాబాద్లోని పలు దుకాణాల నుంచి బిల్లులు తీసుకొచ్చి చెక్లు జారీ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాల్సిన నిధులు కావడంతో క్యాష్బుక్లో అప్పటికప్పుడు మార్పులు చేశారు. అంతకుముందే (మార్చి 31న) క్యాష్బుక్ ముగింపు కావడంతో కొత్తగా ఖర్చు వివరాలు పొందుపరిచేలా వైట్నర్ను ఉపయోగించి పాతవాటిని తొలగించి కొత్తగా ఈ ఖర్చులను చేర్చారు. ఇందులో పశుగ్రాసం కోసం రూ.1.80 లక్షలు ఖర్చు చేసినట్లు రాయడం గమనార్హం. ఆలయంలో జరిగిన అవినీతిపై దేవాదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు అందింది. ఆ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో బాసర వచ్చి విచారణ చేపట్టారు. దీన్ని ఇద్దరు ఆలయ ఉద్యోగుల మధ్య గొడవగా పైకి చూపించే ప్రయత్నం చేసినా అవినీతిపైనే విచారణ నిర్వహించినట్లు సమాచారం. విచారణ చేపట్టిన దేవాదాయశాఖ ఆర్జేడీ కృష్ణవేణి తప్పులను గుర్తిస్తూ కమిషనర్కు నివేదిక సమర్పించినట్లు ఆలయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. మిగులు నిధులకు బిల్లులు సృష్టించి రెండు రోజుల్లో క్యాష్బుక్ మార్చిన ఉద్యోగులు మరో నాలుగైదు రోజుల్లోనే ఆ నిధులను జేబుల్లో వేసుకున్నారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చెక్కులతో నిధులను మళ్లించారు. మూడు రోజుల్లో సుమారు 20 చెక్కులను జారీ చేశారు. ఏప్రిల్ 16న ఆలయ చెక్కు నంబర్లు 324323, 324332, 324334, 324335, 234336, 324338ల ద్వారా రూ.15,16,079 నగదును ఉపసంహరించారు. 17న 324337, 324256, 324245, 324247 చెక్కుల ద్వారా రూ.17,81,639 కొల్లగొట్టారు. 18న 234253, 324254ల ద్వారా రూ.6,70,068 ఉపసంహరించారు. ఇలా రూ.40 లక్షల ఆలయ నిధులు హాంఫట్ అయ్యాయి. ఇవేకాకుండా మహారాష్ట్రలోని పలు దుకాణాల ద్వారా కొనుగోళ్లు జరిపినట్లు లావాదేవీలను సృష్టించి సుమారు రూ.10 లక్షల మేర అవినీతికి పాల్పడినట్లు సమాచారం. తమ అవినీతి బండారం బట్టబయలయ్యే అవకాశం ఉందని భావించిన ఆలయ ఉన్నతాధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. మరోవైపు ఈ వ్యవహారంలోని కీలక వ్యక్తి బాసర నుంచి బదిలీ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బాసర ఆలయంలో అవినీతి జలగలు
Related tags :