* లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మద్దతు తెలిపాయి. బుధవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక జరిగింది. ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ బలపరిచారు. ఓం బిర్లాను స్పీకర్ స్థానానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి, వైఎస్సార్‌సీపీ నేత మిథున్‌రెడ్డి, ఇతర పార్టీ నాయకులు తోడ్కొని వెళ్లారు. స్పీకర్ స్థానంలో ఓం బిర్లా ఆశీనులవుతున్న సమయంలో ‘భారత్ మాతాకీ జై’ అంటూ సభ్యులు నినాదాలు చేశారు.
* ఆ ఇద్దరూ రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?
బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లు ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. తమకు పార్లమెంట్ మాజీ సభ్యులు గల గుర్తింపు కార్డులను మంజూరు చేయాలంటూ. ఈ ఇద్దరు సీనియర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తొలి సమావేశాలు నిర్వహించేందుకు భేటీ అయిన పార్లమెంట్‌కు వారు ధరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇటీవల జరిగిన 17 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. నారోగ్యం కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుష్మా ప్రకటించగా.. వయో భారంతో మహాజన్ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఇక రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంట్లు.. ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులకు సుమిత్ర మహాజన్ విందును కూడా ఏర్పటుచేసినట్లు సమాచారం. తనకు పార్లమెంట్ సభ్యురాలిగా, లోక్‌సభ స్పీకర్‌గా అవకాశం కల్పించిందుకు బీజేపీ పెద్దలకు ప్రత్యేక ధన్యావాదాలంటూ ఇటీవల ఆమె ట్వీట్ కూడా చేశారు. అయితే ఆమె ధరఖాస్తును పరిశీలించిన కేంద్రం త్వరలోనే గుర్తింపు కార్డును జారీచేస్తామని చెప్పినట్లు ఆమె వ్యక్తిగత కార్యదర్శి పంకజ్ కృష్ణసాగర్ తెలిపారు.
* మీడియా ప్రతినిధులకు స్వీట్లు పంచిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 49వ వడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు రాహుల్ గాంధీ స్వీట్లు పంచారు. రాహుల్‌కు మీడియా ప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో రాహుల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. రాహుల్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక మరియు ఐటీ రంగాలలో ముందుకు తీసుకు వెళ్తా .- మంత్రి మేకపాటి
రాష్ట్రంలో పరిశ్రమలు మరియు ఐటీ రంగాల్లో పురోగతి సాధించి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనే ధ్యేయంగా పని చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఐటీ శాఖా మంత్రి వర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు స్పష్టం చేశారు.ఈరోజు సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ పరిధిలో జరుగు వివిధ అభివృద్ధి పనుల పై తొలి సంతకం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రివర్యుల కుటుంబ సభ్యులు, పరిశ్రమలు మరియు ఐటీ శాఖాధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
* సోనియా ప్రమాణం.. వైకాపా సభ్యుల అభినందన
యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైకాపా సభ్యులు అభినందనలు తెలిపారు. మంగళవారం లోక్సభ సభ్యురాలిగా ప్రమాణం స్వీకారం చేయడానికి సోనియాగాంధీ తన సీటు నుంచి వెల్ వద్దకు వస్తున్న సమయంలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, తృణమూల్ ఎంపీలతోపాటు వైకాపా సభ్యులు రఘురామ కృష్ణంరాజు, తలారి రంగయ్యలు కూడా బల్లలపై చేతులు చరిచి అభినందనలు తెలిపారు. తన మాతృమూర్తి హిందీలో ప్రమాణం చేస్తుండగా రాహుల్గాంధీ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ‘హిందీలో ప్రమాణం చేసినందుకు సోనియాగాంధీకి శుభాకాంక్షలు’ అంటూ భాజపా సభ్యులు కొందరు వ్యాఖ్యానించారు. అనంతరం భాజపా ఎంపీ మేనకాగాంధీ పేరును సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ పిలవడంతో భాజపా సభ్యులు బిగ్గరగా శబ్దం చేస్తూ బల్లలను చరిచారు. ఆమె ప్రమాణం చేసిన అనంతరం తోటి కోడళ్లు ఇద్దరూ ఒకరికొకరు ముకుళిత హస్తాలతో నమస్కరించుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వీల్‌ఛైర్‌లో వచ్చిన ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్(79) తన సీటు నుంచే ప్రమాణం చేశారు.
* ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి: మంత్రి గౌతమ్‌రెడ్డి
మంత్రిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసీ పేమెంట్ క్లియరెన్స్ ఫైల్‌పై గౌతమ్‌రెడ్డి తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రంతో మాట్లాడామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎంవోయూలు వాస్తవమేనని కానీ రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదన్నారు.భూములు ఇచ్చినా కొన్ని పరిశ్రమల పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదన్నారు. 42 పరిశ్రమల ఏర్పాటులో సమస్యలున్నాయన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని తెలిపారు. ఐటీ శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తామని.. బీపీవోలను గ్రామస్థాయికి విస్తరిస్తామని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.
* కాళేశ్వరంతో ఏపీ ఎడారిలా మారబోతోంది: తులసిరెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎడారిలా మారబోతోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా తులసిరెడ్డి, మాజీ మంత్రి సాయిప్రతాప్ కేక్ కట్ చేశారు. కాళేశ్వరం ఆపాలని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జలదీక్ష చేశారని తులసిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
* పది కోట్లు ఇస్తామంటూ భాజపా ఎర-కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపణ
కర్ణాటకలో అధికార జనతాదళ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు భాజపా ప్రయత్నిస్తోందని సీఎం కుమారస్వామి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ఘట్టం ముగియడంతో మళ్లీ ‘ఆపరేషన్ కమల’ను తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బెంగళూరులో ఆయన మాట్లాడారు. ‘‘భాజపా నాయకులు మా మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. భాజపాలో చేరితే రూ.10 కోట్లిస్తామని ఆశ చూపుతున్నారు’’ అని ఆరోపించారు. ‘పది మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వారంతా భాజపాలోకి వస్తున్నారు. మీరు కూడా రండి అంటూ ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తున్నారు’ అని కుమారస్వామి ధ్వజమెత్తారు. తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా కమలదళంలో చేరరని తేల్చి చెప్పారు.
* నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. వైస్ ఛైర్మన్ ఛాంబర్‌లో.. శాసనమండలి సభ్యులుగా పట్నం మహేందర్‌రెడ్డి, తెర చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అంతకు ముందు ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు, సీఎం కేసీఆర్‌కు మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, ఇతర ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసిన మహాత్ముడు కేసీఆర్ అని కొనియాడారు.
*కాంగ్రెస్ పక్ష నేతగా అధీర్
లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా అనూహ్యంగా పశ్చిమబెంగాల్కు చెందిన సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌధరీ (63)ని ఆ పార్టీ ఎంపిక చేసింది. యూపీయే అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ ఆయన్ను ఎన్నుకొంది. బెర్హంపోర్ నుంచి 5 సార్లు ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్న అధీర్ లోక్సభలో కాంగ్రెస్కు చెందిన ఎంపీల్లో అత్యంత సీనియర్లలో ఒకరు.
*హోదా ఇవ్వాల్సిందే
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ గట్టిగా గళమెత్తింది. ప్యాకేజీ వద్దే వద్దని తేల్చి చెప్పింది. హోదా ఇవ్వాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన మంగళవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా ఆమోదించారు. మండలిలోనూ ఇదే తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టారు.
*మా చెత్తను భాజపా ఏరుకుంటోంది!
అవినీతి, అత్యాశపరులే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని వీడి వెళుతున్నారు. వారంతా తమ నిర్వాకానికి గాను, తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే భాజపాలో చేరుతున్నారు.అవినీతికి పాల్పడినవారిపై చర్యలు చేపడుతున్నాం. ‘చెత్త’ను మేం బయటకు పంపుతుంటే.. కాషాయ పార్టీ ఏరుకుంటోంది.
*తుది శ్వాస వరకు కాంగ్రెస్లోనే
పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యూఐ స్థాయి నుంచి కాంగ్రెస్లో ఉన్నానని, బతికున్నంత వరకు పార్టీని వీడేది లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీని వీడుతున్నారా? అని మళ్లీ మళ్లీ అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ బాగుండాలని మాత్రమే రాజ్గోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.
*వీహెచ్, వైఎస్సార్ అభిమానుల ఘర్షణ
‘అనుమతి సాకుతో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయనీయకపోతే.. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని కూల్చేస్తాం..’ అంటూ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అనడంతో పంజాగుట్టలో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపు వైఎస్ఆర్ అభిమానులకు, వీహెచ్కు మధ్య వాగ్వాదం నెలకొంది. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో ఇటీవల అంబేడ్కర్ విగ్రహం తొలగించిన ప్రదేశంలో తాము మళ్లీ ఏర్పాటు చేస్తామని మంగళవారం ఉదయం మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్ విగ్రహంతో చేరుకున్నారు.
*ఫీజుల పెంపుపై రాజీలేని పోరాటం: కె.లక్ష్మణ్
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక మధ్య తరగతి తల్లిదండ్రులు చితికిపోతున్నారని.. ఫీజులను నియంత్రించాల్సిన ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి విస్మరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాజీలేని పోరాటాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల పెంపుపై రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
*దిల్లీ భేటీకి చంద్రబాబు దూరం
పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ బుధవారం దిల్లీలో నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కావడం లేదు. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. చంద్రబాబు బుధవారం వేకువజామునే కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు.
*తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలపడేలా పని చేస్తాం
కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా నాయకత్వంలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ భాజపా బలపడేలా పని చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్ అన్నారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన జె.పి.నడ్డాను మంగళవారం రాత్రి వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
*విభజన చట్టం హామీల అమలు కోసం పోరాటం
నాడు తెలంగాణ బిల్లుకు తొలి ఓటు వేసిన రోజు మరపురానిదని తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రమాణం స్వీకారం చేస్తున్న సమయంలో ఓటు వేసిన ప్రజలను గుర్తు చేసుకున్నానని చెప్పారు.
*ఎకరాకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఎలా పరిహారం ఇచ్చారో.. పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు కూడా అదే తరహాలో నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నాగం జనార్దన్రెడ్డి, మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్ ధర ఎకరాకు రూ. 20 లక్షల వరకు వుంది.. ప్రభుత్వం రూ. 10 లక్షలైనా ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచినప్పుడు నిర్వాసితులకు పరిహారం పెంచరా? అని ప్రశ్నించారు.
*తెలుగు ఎంపీలకు 25న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విందు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు ఈ నెల 25న విందు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వారు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారని ఆయన తెలిపారు.
*సోనియా ప్రమాణం.. వైకాపా సభ్యుల అభినందన!
యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైకాపా సభ్యులు అభినందనలు తెలిపారు. మంగళవారం లోక్సభ సభ్యురాలిగా ప్రమాణం స్వీకారం చేయడానికి సోనియాగాంధీ తన సీటు నుంచి వెల్ వద్దకు వస్తున్న సమయంలో కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, తృణమూల్ ఎంపీలతోపాటు వైకాపా సభ్యులు రఘురామ కృష్ణంరాజు, తలారి రంగయ్యలు కూడా బల్లలపై చేతులు చరిచి అభినందనలు తెలిపారు. తన మాతృమూర్తి హిందీలో ప్రమాణం చేస్తుండగా రాహుల్గాంధీ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు.
*నిర్వాసితుల బాధలు ఎవరికి చెప్పుకోవాలి: చాడ
‘నీటిపారుదల శాఖకు మంత్రి లేరు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు. మరి భూనిర్వాసితుల కష్టాలు ఎవరికి మొర పెట్టుకోవాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశాన్ని సచివాలయంలో కాకుండా ప్రగతి భవన్లో నిర్వహించడంపై విస్మయం వ్యక్తం చేశారు.
*హోదాపై తీర్మానాల్ని విస్మరించారు: యనమల
ప్రత్యేక హోదాపై శాసనసభలో ఎన్ని తీర్మానాలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని శాసనమండలిలో తెదేపాపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై గతంలో రెండుసార్లు తీర్మానాలు చేశామని, ఇప్పుడు చేసింది మూడోదవుతుందని ఆయన మంగళవారం శాసనసభ ఆవరణలో విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలిపారు.
*వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదు
‘‘కృష్ణానదీ వెంబడి కరకట్టపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నివాసం అక్రమమని వైకాపా నేతలు అంటున్నారు. అదే కరకట్ట వెంబడి ఉన్న ఆశ్రమాల విషయంపై వారు ఏం సమాధానం చెబుతారు? ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలు. చంద్రబాబును చులకన చేసి మాట్లాడినందుకు వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదు.
*కుంభకోణాల్ని బయటపెడతాం: మంత్రి బొత్స
రాజధాని అమరావతి అంటే కుంభకోణాల నిలయమని, తెదేపా హయాంలో ఇక్కడ జరిగిన పనులపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అమరావతి పనుల పేరుతో జరిగిన కుంభకోణాలను ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతామని, ఏయే పనుల్లో ఏం జరిగిందో కొద్ది రోజుల్లోనే వెల్లడవుతాయని పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
*విశ్వసనీయత లేని రుణమాఫీ
వ్యవసాయ రుణాలమాఫీ విషయంలో గతంలో తెదేపా ఇచ్చిన హామీ..పెండింగ్ బకాయిలపై తెదేపా, వైకాపా సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. 2014 ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాల మొత్తాన్ని మాఫీ చేస్తామన్నారా? లేదంటే రూ.లక్షన్నర చేస్తామన్నారా? అన్నదానిపై సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు.
* ఇరాన్ కోసం కాచుకొని ఉన్నాం: ట్రంప్
ఇరాన్ చర్యలను తాము ముందే ఊహించి అందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు ట్యాంకర్లపై దాడి జరగిన నాటి నుంచి అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం ట్రంప్ స్పందించారు. ‘‘మేము ఇరాన్ కోసం కాచుకొని ఉన్నాము. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. వారేం చేస్తున్నారో చూస్తున్నాం. కేవలం గత వారం చేసిన విషయాలు కాదు.. చాలా కాలం నుంచి ఇరాన్‌ను గమనిస్తున్నాం. అది ఉగ్రవాద దేశంగా కొనసాగుతోంది.’’ అని ఆయన వ్యాఖ్యానించారు. టైమ్ పత్రికతో మాట్లాడుతూ ట్రంప్ ఈ మాటలు అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా సైనిక చర్య చేపట్టడానికి కూడా సద్ధమేనని అన్నారు.
లోక్సభ స్పీకర్‌గా ఓం బిర్లా-రాజకీయ-06/19
Related tags :