మనకు తెలియకుండానే ప్లాస్టిక్ రేణువుల్ని తినేస్తున్నాం. ఎన్ని తింటున్నామో తెలుసా? వారానికి 5 గ్రాములు… అంటే ఓ క్రెడిట్ కార్డు బరువంత అన్నమాట! నెలకు దాదాపు పావు కిలో(250 గ్రాములు) తినేస్తున్నాం! మనకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతోంది. కుళాయి నీళ్లు ప్రత్యేకించి, ప్లాస్టిక్ సీసాల్లో మనం తాగుతున్న నీళ్ల ద్వారా సూక్ష్మాతిసూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు(మైక్రో ప్లాస్టిక్స్) మనిషి శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు ఆస్ట్రేలియాలోని న్యూక్యాజిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఇదే కాదు.. చేపలు, నత్తగుల్లలు, బీరు, సముద్రపు ఉప్పు, ధూళి కణాల ద్వారానూ ప్లాస్టిక్ రేణువులు మన శరీరంలోకి వెళుతున్నట్లు కనుగొన్నారు. దాదాపు 52 అధ్యయనాలను సమీక్షించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారణలతో కొత్త నివేదికను తయారుచేశారు.
మీకు తెలుసా?
* ప్లాస్టిక్ ఉత్పత్తి రెండు దశాబ్దాలుగా అనూహ్యంగా పెరిగింది. గత 20 ఏళ్లలో ఉత్పత్తిచేసిన ప్లాస్టిక్- మానవ జాతి చరిత్ర మొత్తంలో తయారైన ప్లాస్టిక్‌తో సమానం.
* ప్లాస్టిక్ పరిశ్రమ 2025 దాకా ఏటా 4% మేర వృద్ధి చెందుతుంది(గ్రాండ్ వ్యూ రీసెర్చ్ తాజా నివేదిక)
* తయారీరంగం, పరిశ్రమలు, 3డీ ప్రింటింగ్‌లో మైక్రోప్లాస్టిక్స్‌ను ఎక్కువగా వాడతారు.
* అన్ని రకాల ప్లాస్టిక్‌లూ చివరికి 75 శాతానికి పైగా వ్యర్థాలుగా మిగులుతున్నాయి. ఇందులో మూడోవంతు అంటే దాదాపు 10 కోట్ల టన్నుల్ని భూమిపై వ్యర్థాలుగా గుమ్మరిస్తున్నారు లేదా ప్రకృతిలో కలిపేస్తున్నారు. ఏటా కనీసం 24 లక్షల టన్నుల ప్లాస్టిక్ నదుల ద్వారా సముద్రంలో కలుస్తోంది.
* ఇదే పరిస్థితి కొనసాగితే.. 2025 నాటికి సముద్రాల్లో ప్రతి మూడు టన్నుల చేపలకు ఒక టన్ను ప్లాస్టిక్ ఉంటుంది(ఎల్లెన్ మెక్‌ఆర్థర్ ఫౌండేషన్ ప్రచురించిన తాజా నివేదిక).
* ప్రస్తుత నీటి శుద్ధి కేంద్రాల్లో సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ రేణువుల్ని శుద్ధిచేసే సదుపాయం ఉండటం లేదు.
మనిషికి ముప్పు ఎంత?
గాలి, నీరు, ఆహారం.. ఇలా ఏదో ఒక దానిద్వారా శరీరంలోకి వెళ్లిన ప్లాస్టిక్ రేణువులు దేహానికి ఎంతవరకు హాని చేస్తున్నాయనే దానిపై ఇప్పటిదాకా లోతైన పరిశోధనల్లేవు. అయితే భిన్న వాదనలు, సిద్ధాంతాలు మాత్రం వ్యాప్తిలో ఉన్నాయి.
* 150 మైక్రాన్ల(0.15 మిల్లీమీటర్లు) కన్నా పెద్దవైన ప్లాస్టిక్ రేణువులు జీర్ణంకాకుండా, రసాయనాల్ని విడుదల చేయకుండా శరీరం నుంచి బయటికి వచ్చేస్తాయి. అంతకన్నా చిన్న వాటితోనే దేహానికి ప్రమాదం.
* సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు జీర్ణక్రియ సమయంలో విషతుల్య రసాయనాలను విడుదల చేయడంతో పాటు, పేగుల గోడల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అయితే అవి రక్తంలో కలుస్తాయా? లేదా అన్న దానిపై నిర్ధారణలు లేవు.
* సూక్ష్మ ప్లాస్టిక్ చేపల మెదళ్లకి చేరిపోయి.. వాటి ప్రవర్తనను మార్చేసిన రుజువులూ ఉన్నాయి. మనిషి మెదడు కణజాలంలోకి ఇవి చొచ్చుకు వెళతాయా? అన్నది ఇంకా తేలలేదు.
ఎలా నియంత్రించొచ్చు?
* ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు, ప్లాస్టిక్ సీసాలు కాకుండా మళ్లీ మళ్లీ వాడగలిగిన మందమైన వాటిని వినియోగించండి.
* పాలిస్టర్ జాకెట్లను సాధ్యమైనంత తక్కువగా ఉతకండి.
* ఇళ్లలో దుమ్ము పేరుకుపోకుండా చూసుకోండి.
* సాధ్యమైనంతవరకు శుద్ధిచేసిన ఉప్పునే వాడండి.
* కలుషిత నీరు తాగొద్దు.
శరీరంలోకి ఎక్కడ్నుంచి వెళుతున్నాయి?
1. కలుషిత సముద్ర ఆహారం ద్వారా..సముద్రాలు, నీటి వనరులు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. నీటిలో చేరిన చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్ని చేపలు తినేస్తున్నాయి. అలాంటి కలుషిత చేపల్ని తిన్న మనిషీ ప్లాస్టిక్ ముప్పు బారిన పడుతున్నాడు.
2. ఇంటిలో దుమ్ము ద్వారా…మనం పీల్చే గాలి, ఇంట్లో పేరుకుపోయే దుమ్ము ద్వారా కూడా ప్లాస్టిక్ రేణువులు శరీరంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ దుమ్ము ఎంత తీవ్రమంటే.. 20 నిముషాల సేపు భోజనానికి కూర్చుంటే కనీసం 114 ప్లాస్టిక్ రేణువులు మన భోజన ప్లేటులో పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏటా ఇవి 13 వేల నుంచి 68 వేల వరకు ఉండొచ్చని అంచనా.
3. తాగునీటి ద్వారా…నదులు, ఇతరత్రా జల వనరుల్లో కూడా ప్లాస్టిక్ పోగై పోతోంది కాబట్టి.. సహజంగానే సూక్ష్మ రేణువులు తాగునీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ సీసా నీళ్లలో ఈ రేణువులు ఉంటున్నాయి.
4. టైర్ల ద్వారా..దాదాపు 28% ప్లాస్టిక్ రేణువులు టైర్ల ద్వారా వస్తున్నాయి. ఇవి రోడ్లపై నుంచి కొట్టుకువెళ్లి నీటి వనరుల్లో కలుస్తున్నాయి. ఆ నీటిని తాగిన వారి శరీరంలోకి వెళుతున్నాయి.
5. పాలిస్టర్ జాకెట్ల ద్వారా..పాలిమర్‌తో తయారయ్యే పాలిస్టర్ జాకెట్ల ద్వారా రేణువులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ జాకెట్లను ఉతికిన ప్రతిసారీ దాదాపు 1900 ప్లాస్టిక్ రేణువులు విడుదలవుతున్నాయి.
6: సముద్రపు ఉప్పును వినియోగించినపుడు కూడా మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశిస్తోంది.
మైక్రో ప్లాస్టిక్ అంటే..
* 1 మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ల వరకు పరిమాణం ఉండే ప్లాస్టిక్ రేణువుల్ని మైక్రోప్లాస్టిక్ అంటారు.
* 1 మైక్రోమీటర్ నుంచి 100 నానోమీటర్ల మధ్య ఉండేది సబ్ మైక్రోప్లాస్టిక్.