Business

34వేలు దాటిన పసిడి

Gold prices see huge surge-10grams priced at 34000INR

బలమైన అంతర్జాతీయ సంకేతాలు, దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ. 34వేల మార్క్‌ను దాటింది. గురువారం ఒక్కరోజే రూ. 280 పెరగడంతో 10 గ్రాముల పుత్తడి రూ. 34,020 పలికింది. అటు వెండి ధర కూడా నేడు దూసుకెళ్లింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇవాళ ఒక్క రోజే ఏకంగా రూ. 710 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 39,070కు చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ ఆందోళనలతో అంతర్జాతీయంగా భౌగోళిక అనిశ్చితులు నెలకొన్నాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో గత నాలుగు వారాలుగా ఈ లోహం ధర పెరుగుతూ పోతోంది. తాజాగా న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఐదేళ్ల గరిష్ఠానికి చేరి 1,386 డాలర్లు పలికింది. దీంతో దేశీయంగానూ పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.