ఏదైనా వ్యాపారం చేయాలి. ఎవరి మీదా ఆధారపడకుండా. వచ్చిన వంట, కుట్లు అల్లికలు, డ్రెస్ డిజైనింగ్ పట్ల ఆసక్తి, బ్యూటీషియన్ కోర్సు చేసి ఉంటే లేదా మరేదైనా మనకు నచ్చిన వచ్చిన పనితో. మరి దాని కోసం పెట్టుబడి పెట్టాలంటే ఎవరిని సంప్రదించాలి. లోన్ ఎంతిస్తారో. ఏ బ్యాంకులు ఇస్తాయో.. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం. అన్నపూర్ణ పథకం: ఆహార రంగంలో వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు భారతీయ మహిళా బ్యాంకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేస్తోంది. గరిష్టంగా రూ.50 వేల వరకు రుణం మంజూరు చేస్తుంది. సొంతంగా కానీ లేదా భాగస్వామ్యంతో కానీ వ్యాపారం ప్రారంభించొచ్చు. 11.75 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెల మారిటోరియం సమయంతో కలిసి మూడేళ్లలోపు అప్పు కట్టాలి. 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు దీనికి అర్హులు. వంట సామాగ్రి, పరికరాలు, వాటర్ ఫిల్టర్ల, క్యాటరింగ్కు సంబంధించిన ఇతర వస్తువులు సమకూర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. బ్యాంకుల నుంచి రుణం పొందాలనుకునేవారు తమ ఆస్తులకు సంబంధించిన వివరాల పత్రాలు బ్యాంకుకి సమర్పించాల్సి ఉంటుంది.స్త్రీశక్తి ప్యాకేజీ: కుటీర పరిశ్రమ స్థాపించాలనుకునే మహిళలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకం కింద రుణం మంజూరు చేస్తుంది. అయితే ఈ రుణం తీసుకునే వారు కచ్చితంగా రాష్ట్ర స్థాయి ఏజెన్సీ ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వారి పేరు నమోదు చేసుకోవాలి. రెండు లక్షలలోపు అప్పు తీసుకుంటే వడ్డీ రేటులో 0.5 శాతం రాయితీ లభిస్తుంది. రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే వారు ఎలాంటి హామీ చూపించాల్సిన అవసరం లేదు.దేనాశక్తి పథకం: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, తయారీ, మైక్రో క్రెడిట్ స్టోర్స్, ఎడ్యుకేషన్, హౌజింగ్, రిటైల్, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. దేనాబ్యాంకు ఈ రుణాలు అందజేస్తోంది. వడ్డీ రేులో 0.25 శాతం రాయితీ ఇస్తోంది. మైక్రో క్రెడిట్ స్టోర్స్ ప్రారంభించాలనుకునే వారికి రూ.50 వేలు, ఎడ్యుకేషన్, హౌజింగ్,రిటైల్ రంగంలో వ్యాపారం చేయాలనుకునేవారికి రూ.20 లక్షల వరకు రుణం మంజూరు చేస్తోంది. ఉద్యోగిని పథకం: మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా పంజాబ్ అండ్ సింధూ బ్యాంకు ఈ పథకం ప్రవేశపెట్టింది. వ్యవసాయం, ఇతర కుటీర పరిశ్రమలు నెలకొల్పాలనుకునే మహిళలు, స్వయం సహాయక బృందాలు రుణాలు తీసుకోవచ్చు. వ్యాపారాన్ని బట్టి అప్పు విలువ మారుతుంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.మహిళా ఉద్యమ్ నీది పథకం: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలు అందిస్తోంది. చిన్న తరహా పరిశ్రమ ప్రారంభించాలనుకునే మహిళలు ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు. ముద్ర పథకం: చిన్న వ్యాపారులను ప్రోత్సహించాలనుకునేవారిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యూటీ పార్లర్, టైలరింగ్ యూనిట్, ట్యూషన్ సెంటర్ ప్రారంభించాలనుకునేవారికి ఈ పథకం కింద రుణాలు మంజూరు చేస్తారు. బ్యాంకుకు ఎలాంటి హామీ పత్రాలు కూడా సమర్పించాల్సిన అవసరం లేదు.
వ్యాపారం చెయ్యాలనే మహిళలకు బ్యాంకుల అండ
Related tags :