Editorials

అమెరికా యాపిళ్లకు ఇక గడ్డుకాలమే

Indian tariffs on American apples is killing their farming

అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 29 రకాల ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని భారత్ తీసుకున్న నిర్ణయం, అమెరికా ఆపిల్ పళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎగుమతులపై ఆధారపడే వాషింగ్టన్ రాష్ట్ర ఆపిల్ పరిశ్రమకు శరాఘాతమే అయ్యింది. వాషింగ్టన్ రాష్ట్రంలో పండే ఆపిల్ పళ్లలో 30 శాతం ఎగుమతులే ఉంటాయి. విశ్వసనీయ, ఇప్పటికే బాగా విస్తరించిన విపణిని వదిలేసుకుని, ఇతర మార్కెట్లను ఆశ్రయించాలనుకోవడం చాలా కష్టమని అంటున్నారు. 2017 పంటకు సంబంధించి, 2018 జూన్ మధ్య వరకు 40 పౌండ్ల (18.15 కిలోల) బరువుండే నాణ్యమైన ఆపిల్ పళ్ల బాక్సులు 78 లక్షల మేర భారత్కు ఎగుమతి అయ్యాయి. అయితే 2018 పంటకు వచ్చేసరికి భారత్కు వాషింగ్టన్ రాష్ట్రం నుంచి ఆపిల్ పళ్ల ఎగుమతులు బాగా తగ్గాయి. కేవలం 26 లక్షల బాక్సుల మేర సరఫరా చేసింది. భారత్కు ఎగుమతి అయ్యే ఆపిల్ పళ్లలో రెడ్ డెలిసియస్ రకమే 90 శాతం ఉంటాయి. 1999 నుంచి భారత్కు అమెరికా ఆపిల్ పళ్లు ఎగుమతి చేస్తుండగా, 50 శాతం సుంకాలు చెల్లిస్తోంది. తాజాగా అమలు చేస్తున్న 20 శాతం దిగుమతి సుంకం వల్ల, అమెరికా నుంచి వస్తున్న ఆపిల్ పళ్లపై సుంకం భారం 70 శాతానికి చేరనుంది. ఇందువల్ల భారత్కు ఎగుమతులు మరింత తగ్గుతాయనేది అమెరికా ఆపిల్ పరిశ్రమ ఆందోళన. అందుకే దీనిపై ట్రంప్ ప్రభుత్వంతో పళ్ల పెంపకందారులు గత వారంలో చర్చలు జరిపారు. అయితే ఏ రకమైన ఆశాజనక సూచనలు ప్రభుత్వం నుంచి రాకపోవడం వారిని నిరాశ పరచింది. జీ20 సమావేశాల్లో భాగంగా వచ్చే వారంలో భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలవనున్నారు. ఈ సమావేశాల్లో అయినా సుంకాలపై ఏమైనా కదలిక వస్తుందేమోనని ఆశిస్తున్నారు. అమెరికా ఆపిళ్లపై సుంకాల వల్ల, ఆపిల్ పండే న్యూజిలాండ్, చిలీ వంటి దేశాలకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.