తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన తెదేపాను మరింత నిర్వీర్యం చేయడం కోసం ఢిల్లీ స్థాయిలో భారీ ప్రణాళికలే రూపుదిద్దుకుంటున్నాయి. చంద్రబాబును పార్టీలో ఏకైక వ్యక్తిగా మిగల్చాలన్న లక్ష్యంతో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. చంద్రబాబుకు కుడి ఎడమ చేతులుగా పని చేసిన సుజనా చౌదరి, సిఎం రమేష్ లను జైలులోకి వెళ్లే విధంగా భాజపా వారిపై దాడులు జరిపి లోబరుచుకుంది. మోడీ కళ్లు పట్టుకోకపోతే వారిరువురికీ భవిష్యత్తు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకంగా రాజ్యసభలో పార్టీ పునాదులనే వారు పెకిలించారు. చంద్రబాబు ఆత్మగా పేరున్న గరికపాటి మోహనరావు కూడా గోడ దూకేశారు. కాంగ్రెస్‌లో ఉన్న టీజీ.వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వాన్ని చంద్రబాబు టోకుగా అమ్మేశారు. వ్యాపార ప్రముఖుడైన టీజీ.వెంకటేష్ తన భవిష్యత్తును చూసుకున్నారు. ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు తెదేపా వీడి భాజాపాలోకి కలిసిపోవడం ఖరారైపోయింది. ప్రస్తుతం రాజ్యసభలో చంద్రబాబుకు ఇరువురు సభ్యులు మాత్రమే మిగిలారు. కాకినాడకు చెందిన సీతామహాలక్ష్మిని కూడా భాజపాలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న ప్రముఖ న్యాయవాది కనకమేడల రవీంద్రబాబు తెదేపా సభ్యుడిగానే కొనసాగే అవకాశం ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా భాజపాలోకి వెళ్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
*** ఎమ్మెల్యేలు కూడా భాజపాలోకి?
ప్రస్తుతం అసెంబ్లీలో తేదేపాకు చంద్రబాబుతో కలిపి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి అవసరం వైకాపాకు ఏమాత్రం లేదు. జగన్ కూడా రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని షరతు పెట్టారు. దీంతో తెదేపా ఎమ్మెల్యేలకు భాజపా నాయకులు ప్రలోభాలు చూపుతున్నట్లు సమాచారం. భాజపాలోకి వస్తే రాష్ట్రంలో అధికార పార్టీలోకి వచ్చినట్లేనని ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలను భాజపా నేతలు తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం మాజీ ఎంపీ జేసీ.దివాకరరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భాజపాలోకి వెళ్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. తెదేపాకు చెందిన చాలా మంది మాజీ ప్రజాప్రతినిధులు, భాజపాలోకి వెళ్లడానికి బారులు తీరుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదనే ప్రచారాన్ని ఆ పార్టీ వ్యతిరేకులు గత కొద్ది రోజుల నుండి ముమ్మరంగా తెరపైకి తెచ్చారు. ఏదీ ఏమైనప్పటికీ చంద్రబాబు తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో తీవ్రమైన రాజకీయ సంక్షొభాన్ని, గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు అభిమానులు, తెదేపా కార్యకర్తలు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు వ్యతిరేకులు మాత్రం చాలా సంబరంలో ఉన్నారు. ఆనాడు ఎంటీఆర్‌కు చంద్రబాబు చేసిన ఘోరం ఇన్నేళ్ల తరువాత తిరిగి ఆయనకు ఎదురయిందని వ్యతిరేకులు ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొని నిలబడగలుగుతారో వేచి చూడాల్సి ఉంది! –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
గరికపాటి కూడా గోడ దూకారుగా? చంద్రుడిని ఒంటరి చేసే ప్రయత్నాలు-TNI ప్రత్యేకం
Related tags :