సామాన్య జనానికి ఉల్లిగడ్డ షాక్ ఇస్తోంది. రెండు వారాలుగా ఉల్లి ధర పెరుగుతూ వస్తోంది. రాబోయే రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. లోకల్గా ఉత్పత్తి తగ్గడం, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ధరలపై ప్రభావం పడుతోందని వ్యాపారులు చెపుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయలు, మాంసం ధరలు పెరుగుతుండటంతో జనానికి కష్టాలు తప్పేలా లేవు.
**ఎందుకు పెరుగుతోందంటే..?
గత సీజన్‌లో తెలంగాణ, ఏపీ నుంచి భారీ ఎత్తున ఉల్లిగడ్డ హైదరాబాద్‌కు వచ్చింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర కూడా రాలేదు. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.2 పలికింది. అయితే ఈ ఏడాది తెలంగాణ, ఏపీల్లో ఉత్పత్తి తగ్గింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక నుంచి ఎక్కువగా దిగుమతి అవుతోంది. మెదక్ జిల్లా నుంచి కొద్ది మేర మలక్‌పేట మార్కెట్‌కు వస్తోంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. రాష్ట్రంలో ఉల్లి దిగుబడి లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే అదనుగా మహారాష్ట్ర వ్యాపారులు ఉల్లి రేట్లు పెంచినట్లు తెలుస్తోంది.
**ఇంకా పెరిగే అవకాశం..?
మలక్ పేట మార్కెట్‌కు సాధారణంగా ఈ సీజన్‌లో 30 వేల దాకా ఉల్లిగడ్డ బస్తాలు వస్తాయి. అయితే ఈసారి అది 15 వేల బస్తాలకు పడిపోయింది. ఈ నెల 4న మొదటి రకం 6,056, రెండో రకం 9,084 క్వింటాళ్ల చొప్పున రాగా, మంగళవారం మొదటి రకం 2,163, రెండో రకం 3,229 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఉల్లి దిగుమతి మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్‌లో క్వింటాల్ ఉల్లిని రూ.600 నుంచి 2,000 వరకు అమ్ముతున్నారు. వారం క్రితం వరకు ఇది రూ.400 నుంచి1,700 వరకు ఉంది. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర వారం కిందటి వరకు కిలో రూ.15–20 ఉండగా, ఇప్పుడు రూ.25–30పలుకుతోంది. కొద్ది రోజుల్లో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
**మండిపోతున్న కూరగాయలు..
మరోవైపు కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. టమోటా ధర కిలో రూ.40పైనే పలుకుతోంది. కిలో బెండకాయ 70, ఆలు 30, దొండకాయ 60, క్యాబేజీ 50, క్యాప్సికమ్ 70.. ఇలా అన్ని కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. నెల రోజులుగా చికెన్ ధరలు కూడా పెరిగిపోయాయి. రిటైల్ లైవ్ బర్డ్ ధర 162, స్కిన్‌తో 235, స్కిన్‌లెస్ 270 దాకా ఉంది. మటన్ కూడా కిలో 650 వరకు అమ్ముతున్నారు. ధరలు పెరగడంతో జనం వీటిని కొనే పరిస్థితి కనిపించడం లేదు.
ఉల్లిపాయలకు విపరీతమైన గిరాకీ
Related tags :