ప్రభుత్వ పాఠశాలల్లో అన్నమయ్య సంకీర్తనాగానం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం IAS
రేణిగుంటలోని ఎపి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రారంభం
విద్యార్థుల్లో భక్తిభావాన్ని పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనాగానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు.
టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం రేణిగుంటలోని ఎపి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జెఈవో ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండి భక్తిభావాన్ని అలవరుచుకోవడం ద్వారా జీవితంలో సక్రమమార్గంలో పయనించేందుకు వీలవుతుందన్నారు.
అన్నమయ్య సంకీర్తనలను వినిపించడంతో పాటు వాటి భావాన్ని వ్యాఖ్యాన రూపంలో తెలియజేస్తున్నామని తెలిపారు.
ధర్మప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తద్వారా శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేస్తున్నామని వివరించారు. 2 గంటల పాటు ఈ కార్యక్రమంజరుగుతుందని, దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎపి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ఓఎస్‌డి శ్రీ డి.కౌండిన్యసాయి, టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య బి.విశ్వనాథ్, రేణిగుంట పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ జె.కృష్ణానాయక్, అన్నమాచార్య ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.