Fashion

క్రయో ఫ్రీజింగ్‌తో మీ పులిపిర్లు పోగొట్టవచ్చు

Cryo Freezing Enables Wart Removal

పులిపిర్లనే స్కిన్‌ ట్యాగ్స్‌ అని అంటారు. ఇవి చిన్నగా, మెత్తగా, చిన్న చిన్న బొడిపెల్లా ఉంటాయి. చర్మ రంగులోనే ఉంటాయి. స్కిన్‌ గ్రోత్‌ ఎక్కువగా ఉండటం వల్ల పులిపిర్లు వస్తాయి. ఇవి క్యాన్సర్‌కి సంకేతం కాదు, హానికరం అంతకన్నా కాదు కాబట్టి భయపడాల్సిన అవసరంలేదు. ఇవి సాధారణంగా కనురెప్పలు, మెడ, చేతుల కింద, ముఖం, అరుదుగా శరీర రహస్య భాగాల్లోనూ కనిపిస్తాయి. ఇవి కొందరిలో ఒకటి, రెండు ఉంటే మరికొందరిలో వందల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక్కసారైనా ఇవి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మధ్యవయసు వారిలో మొదలై అరవై ఏళ్లవరకూ పులిపిర్లు కనిపిస్తాయి. లావుగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పులిపిర్లు కొన్నిసార్లు వాటంతట అవే రాలిపోతాయి. వీటిని వైద్య పరిభాషలో ఫైబ్రోఎపిటోలియల్‌ పాలిప్స్‌ అని అంటారు. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. వీటికి సరైన కారణాలను ఇంకా గుర్తించలేదు. గర్భం దాల్చినప్పుడు జరిగే హార్మోన్ల మార్పులతోనూ ఈ పులిపిర్లు కనిపిస్తాయి. వారసత్వంగానూ కొందరిలో వస్తాయి. కొందరు వీటిని తొలగించడానికి ఇంట్లో నాటు పద్ధతులను ఉపయోగించడం, టీట్రీఆయిల్‌, డెర్మాసిల్‌క్రీమ్‌, వార్ట్‌రిమూవల్‌ క్రీమ్‌లను వాడటం చేస్తుంటారు. అవేవీ పనిచేయవు సరికదా! ఈ ప్రయత్నాల వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. మార్కెట్‌లో దొరికే ఏ క్రీములూ వీటిని తొలగించలేవు. పులిపిర్లు ఇబ్బందిపెడుతున్నాయని అనుకున్నప్పుడు వైద్యులు స్నిప్పింగ్‌, రేడియో ఫ్రీక్వెన్సీ, క్రయో ఫ్రీజింగ్‌, స్ట్రాంగిలేషన్‌, బర్నింగ్‌ వంటి విధానాల ద్వారా వీటిని సురక్షితంగా తొలగిస్తారు.