అధికారానికి దూరమైన ప్రతిసారీ టీడీపీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ చోటు చేసుకొన్నటువంటి ఘటనలే అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ చోటు చేసుకొన్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుండి వలసలు పెరుగుతుంటాయి. గత ఐదేళ్లలో ఏపీ రాష్ట్రంలో టీడీపీలో ఇదే జరిగింది.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది. కేవలం 23 మంది ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలకే ఆ పార్టీ పరిమితం. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.టీడీపీలోని కీలక నేతలను తమ వైపుకు లాక్కొనేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారు. టీడీపీపీని బీజేపీలో విలీనం చేశారు. ఈ పరిణామం టీడీపీకి మింగుడుపడలేదు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ ఇదే తరహా ఘటనలు గతంలో జరిగాయి. ఎన్టీఆర్ బతికున్న సమయంలో కూడ టీడీపీ నుండి నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్లారు. పార్లమెంట్, రాజ్యసభ ఎంపీలు పార్టీలు ఫిరాయించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి.ఎన్టీఆర్ బతికున్న సమయంలో 1989లో ఆ పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో కూర్చుంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో తొలుత చెన్నారెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఐదేళ్ల కాలంలో పలువురు సీఎంలుగా పనిచేశారు. 1991లో ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు పార్లమెంట్లో తన ప్రభుత్వానికి మెజారిటీ కోసం టీడీపీ ఎంపీలపై కేంద్రీకరించారు.1992లో పీవీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టిన సమయంలో తెలుగు రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావుకు మద్దతు పేరుతో ఆరుగురు టీడీపీ ఎంపీలు పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేశారు. ఆ సమయంలో పార్లమెంట్లో టీడీపీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా భూపతిరాజు విజయకుమార్ రాజు ఉన్నాడు.విజయకుమార్ రాజు నేతృత్వంలో ఆరుగురు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.ఆ తర్వాత ఒంగోలు ఎంపీగా ఉన్న కరణం బలరాం కూడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ఏపీ రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించింది.2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలైంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. యూపీఏ1 ప్రభుత్వంపై వామపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు అవిశ్వాసాన్ని ప్రతిపాదించాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు టీడీపీ ఎంపీలను తమ వైపుకు తిప్పుకొంది. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్లమెంట్ వద్దే ఉండి ఈ వ్యవహరాన్ని నడిపించారని టీడీపీ ఆరోపించింది.టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మందా జగన్నాథం, డీకే అదికేశవులు నాయుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటేశారు. మందజగన్నాథం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ఆనాడు పార్లమెంట్లో టీడీపీపీ నేతగా ఉన్న ఎర్రన్నాయుడు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ, ఎర్రన్నాయుడు వారిస్తున్నా లెక్కచేయకుండానే మంద జగన్నాథం ఓటు వేశారు.ఓటింగ్ పూర్తైన తర్వాత మంద జగన్నాథం ఎర్రన్నాయుడిపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన మంద జగన్నాథం 2009 నాగర్ కర్నూల్ నుండి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి నంది ఎల్లయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2008 చివర్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. అంతకు ముందే టీడీపీలో నెంబర్ టూ గా వెలుగొందిన దేవేందర్ గౌడ్ తెలంగాణ సాధన కోసం టీడీపీని వీడారు. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. దేవేందర్ గౌడ్ తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడ పీఆర్పీలో చేరారు.ఆ తర్వాత దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి టీడీపీలో చేరారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి టీడీపీని వీడనున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు.ఇక ప్రజారాజ్యం ఏర్పాటైన తర్వాత టీడీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడి పీఆర్పీలో చేరారు. కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం, గంటా శ్రీనివాసరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, కోటగిరి విధ్యాధర రావు లాంటి నేతలు ఆ సమయంలో టీడీపీకి గుడ్‌బై చెప్పారు. 2009 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి పీఆర్పీతో పాటు లోక్‌సత్తా కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. వైఎస్ మరణం తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 92 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి 156 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు. టీఆర్ఎస్ 45 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 స్థానాలకే పరిమితమైంది.అయితే 2014 ఎన్నికలు వచ్చే నాటికి టీడీపీలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో, ఆంద్రా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. దీంతో ఎన్నికల నాటికి ఆ పార్టీ 70 స్థానాలకు పరిమితమైంది.2014లో రాష్ట్రం విడిపోయింది. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉంది.ఈ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది.
ఓటమితో తెదేపాకు ఎప్పుడూ ఇబ్బందులే
Related tags :