ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఎనిమిది రకాల అధిక దిగుబడినిచ్చే వంగడాల విడుదలకు రాష్ట్ర స్థాయి విత్తన విడుదల కమిటీ సిఫార్సు చేసింది. గురువారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వరి పంటలో మూడు, జొన్న, కంది, వేరుశనగ, నువ్వులు, పత్తి పంటలో ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది కొత్త వంగడాలను విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సంచాలకులు ప్రవీణ్రావు మాట్లాడుతూ తెలంగాణ వాతావరణం, నేలలు, అవసరాలకు అనుగుణంగా స్వల్ప పంట కాలానికి చెందిన విత్తనాల రూపకల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నూతన వంగడాల్లో జేజిఎల్ 24423 వరి విత్తనాన్ని వానాకాలం, యాసంగి సీజన్లో సాగు చేయొచ్చన్నారు. సుడి దోమ, అగ్గితెగులు, చలిని ఈ విత్తనం కొంతమేర తట్టుకుంటుందన్నారు. సన్న గింజ కలిగిన కేఎస్ఎం 733 వరి విత్తనాన్ని రెండు సీజన్లలో విత్తుకోవచ్చని, డబ్ల్యూజిఎల్ 915 మాత్రం వానాకాలానికి అనుకూలమని చెప్పారు. విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు ఆర్.జగదీశ్వర్, విత్తన ధ్రువీకరణ, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, రాష్ట్ర విత్తన జాయింట్ డైరెక్టర్ బాలునాయక్, అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శివప్రసాద్, ఇతర కమిటీ సభ్యులు, ప్రధాన శాస్త్రవేత్తలు సమావేశంలో పాల్గొన్నారు.
8రకాల అధిక దిగుబడి వంగడాల సృష్టి
Related tags :