తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలను పంచుతారు. వాటితో పాటు వారిలో మానసిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆనందంగా ఉండాలంటే.. మనసుకు నచ్చిన పనిచేయాలి. పిల్లలకు అది అలవాటు చేయాలంటే… వాళ్లకు ఇష్టమైన అభిరుచిలో శిక్షణ ఇప్పించాలి. అది వారికి ఓ వ్యాపకంగా మాత్రమే కాదు… ఇష్టమైన పనిని చేస్తున్నామనే సంతోషాన్నీ ఇస్తుంది. కొందరు చిన్నారులు చిన్నచిన్న వాటికే భయపడుతుంటారు. మన పిల్లలేం మినహాయింపు కాదు. అలాంటి సమయంలో భయానికి కారణం తెలుసుకుని, దాన్నెలా అధిగమించాలో చెప్పాలి. ఎల్లప్పుడూ పిల్లలు ఆశావహ దృక్పథంతోనే ముందుకు సాగేలా చూడాలి. అది సాధ్యం కావాలంటే.. ‘నువ్వు ఏదయినా చేయగలవు.. ప్రయత్నించి చూడు’ అనాలే తప్ప ‘నీ వల్ల కాదు..’ అనే మాటలు ఉపయోగించకూడదు. పిల్లలకు వీలున్నప్పుడల్లా కథలు చెప్పాలి. కుదిరితే కేవలం విజయగాథలే కాదు అపజయాలు ఎలా ఉంటాయో.. వాటి నుంచి ఏం నేర్చుకోవాలనేదీ చెప్పాలి. అప్పుడే భవిష్యత్తులో తమకు ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితినీ తట్టుకుని, ముందుకు వెళ్లగలుగుతారు. బడి, ఇల్లే కాకుండా… మిగతా ప్రపంచాన్ని వాళ్లకు చిన్నతనం నుంచీ అలవాటు చేయడం మంచిది. అంటే నలుగురిలో ఎలా మెలగాలో కూడా వారికి తెలియాలి. ఇందుకోసం తోటి పిల్లలతో ఎక్కువసేపు గడిపేలా, ఆరుబయట ఆడుకునేలా చూస్తే చాలు. ఆ క్రమంలో వాళ్లు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. చిన్నతనం నుంచీ వాళ్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్లు ఎదిగేకొద్దీ ఇతరులపై ఆధారపడకుండా ఉండగలరు.
ఆత్మవిశ్వాసం నేర్పండి
Related tags :