బ్రెజిల్లో.. ఒక వ్యక్తి ద్వారా ప్రభుత్వ అనుమతులన్ని చాలా త్వరగా చక్కబెట్టింది. భారత్‌లో.. స్థానిక వ్యాపార భాగస్వామి ద్వారా అనుమతులను పొందింది. చైనాలో.. స్థానిక భూస్వామికి డబ్బులు పంపి ప్రభుత్వంతో అతనికున్న పరిచయాల ద్వారా పనులు పూర్తి చేసుకుంది. మెక్సికోలో.. ప్రభుత్వంలోని కొన్ని వర్గాలకు కార్లు, కంప్యూటర్లు ఇచ్చి పని నడిపించుకుంది. ఇదీ దశాబ్దకాలంలో వాల్‌మార్ట్ వివిధ దేశాల్లో ఎత్తిన లంచావతరాలు. విచిత్రం ఏమిటంటే ఈ తప్పులన్నీ పరిష్కార మార్గంగా భారీ స్థాయిలో అపరాధ రుసుము కట్టడానికి కూడా ఆ కంపెనీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. వాల్‌మార్ట్ పేరు తెలియనివారుండరు. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను, టోకు వ్యాపారాలను నిర్వహిస్తూ బిలియన్ డాలర్లలో లాభాలు పొందుతుందీ కంపెనీ. అయితే లాభాల యావలో పడి.. నిబంధనలకు నీళ్లు వదలింది. దశాబ్ద కాలంగా ఆయా దేశాల్లోని ప్రభుత్వ అధికారులకు మధ్యవర్తుల(బ్రోకర్లు) ద్వారా భారీ స్థాయిలో లంచాలు ఇచ్చి కొత్త స్టోర్లకు అనుమతులు వేగంగా పొందుతూ వచ్చిందని అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు, మార్కెట్ నియంత్రణాధికారులు ఒక సెటిల్మెంట్ ఒప్పందంలో పేర్కొన్నారు.
ఏడేళ్ల పాటు కొనసాగిన దర్యాప్తులో కంపెనీలో ఎక్కడా అంతర్గత నియంత్రణలేదన్న సంగతి తేటతెల్లమైంది. వాల్‌మార్ట్‌కు చెందిన బ్రెజిల్ అనుబంధ కంపెనీ నేరానికి పాల్పడ్డట్లు అంగీకరిస్తూ.. పిటిషన్ పెట్టుకుంది. దీంతో అపరాధ రుసుము కింద 282.7 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.2000 కోట్లు)ను కట్టాలని గురువారం సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ) ఆదేశించింది. అందుకు సైతం వాల్‌మార్ట్ అంగీకరించింది. అమెరికా కంపెనీలు విదేశీ అధికారులకు లంచాలు ఇవ్వడం అక్కడి విదేశీ అవినీతి ప్రక్రియల చట్టం కింద నేరం. ‘అంతర్జాతీయంగా వేగంగా విస్తరించడం ద్వారా వాల్‌మార్ట్ లాభాలను పొందింది. అయితే లంచాల విషయంలో సరైన చర్యలు తీసుకోలేకపోయింద’ని అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రెయిన్ ఎ. బెన్కోవిస్కి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఈసీ ఛార్జీల కింద 144 మిలియన్ డాలర్లకు పైగా; డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(డీఓజే) విధించిన క్రిమినల్ ఛార్జీల కింద 138 మిలియన్ డాలర్లను.. అంటే మొత్తం 282 మిలియన్ డాలర్లకు పైగా కట్టడానికి వాల్‌మార్ట్ అంగీకరించిందని ఎస్ఈసీ తెలిపింది.
మెక్సికోలోని అధికారులకు వాల్‌మార్ట్ అనుమానాస్పద చెల్లింపులు చేసిందని ఏడేళ్ల కిందట న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ విషయాలను కంపెనీ ప్రధాన కార్యాలయంలో తెలియకుండా వారు ప్రయత్నించారు. ఆ విషయం అక్కడకు వెళ్లినా.. అంతర్గత దర్యాప్తు వ్యవస్థను అనునయించగలిగారు. ఆ తర్వాతే డీఓజే, ఎస్ఈసీలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. సమస్య మూలాలను వెతికిపట్టుకోవడానికి కంపెనీ లాయర్లపై, దర్యాప్తు అధికార్లపై దాదాపు 900 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. కాగా, ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు, నియంత్రణాధికార సంస్థలు కోరిన 600 మిలియన్ డాలర్ల కంటే తక్కువ అపరాధ రుసుమును ఇపుడు వాల్‌మార్ట్ చెల్లించనుంది. ఒబామా ప్రభుత్వం చివరి రోజుల్లో సెటిల్మెంట్ ఒప్పందంపై చర్చలు జరిగినట్లు గత నవంబరులో ‘ద టైమ్స్’ వెల్లడించింది. అయితే ట్రంప్ గద్దెనెక్కాక తక్కువ అపరాధ రుసుమును చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోగలగింది. జులై 2000 నుంచి ఏప్రిల్ 2011 వరకు వివిధ దేశాల ప్రభుత్వ అనుమతులు పొందడానికి మధ్యవర్తులకు మిలియన్ల కొద్దీ డాలర్లను చెల్లించినట్లు ఎస్ఈసీ తెలిపింది.
బ్రెజిల్లో ప్రభుత్వ అనుమతులను చిటికెలో చేయించగల ఒక వ్యక్తి(జెనీ అని ముద్దు పేరు)కి చాలా చెల్లింపులు చేసినట్లు దర్యాప్తులో తేలింది. బిల్డింగ్ అనుమతుల ప్రక్రియను త్వరలో ముగించడానికి ఆ వ్యక్తికి దఫాకు 4 లక్షల డాలర్లు చెల్లించేవారట. ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అన్న అనుమానాలున్నాయి. ఇక భారత్‌లో ఇలా చెల్లించే లంచాలకు ‘వృత్తిపరమైన ఫీజులు’గా తన ఖాతాల్లో చూపేది. జులై 2011లో భారత్‌లో ఒక ఉద్యోగి ప్రభుత్వ అధికారులకు ఇలా లంచాలు ఇస్తున్నట్లు వాల్‌మార్ట్‌కు తెలిసినా.. ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
గత ఏడేళ్ల దర్యాప్తులో కంపెనీ అవినీతి వ్యతిరేక చర్యలను మెరుగుపరచామని.. ఆవిషయాన్ని ప్రభుత్వ నియంత్రణాధికారులు గుర్తించారని వాల్‌మార్ట్ పేర్కొంది. కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి చోటా విలువలను పాటిస్తామని వాల్‌మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డగ్ మెక్‌మిలన్ పేర్కొన్నారు. మరో పక్క, నవంబరు 2017లోనే ఎస్ఈసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌లకు అపరాధరుసుము కట్టడానికి 283 మిలియన్ డాలర్లను కేటాయించామని.. అందువల్ల ఈ ప్రభావం ఆర్థిక ఫలితాలపై పడదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.