Business

నెవార్క్-ముంబయి విమానం రద్దు

United Cancesl Newark Mumbai Flight Due To Bombings In Iran

తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిందంటూ అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధీనంలో ఉన్న గగనతలం మీదుగా అమెరికా విమానాలు వెళ్లకుండా ఆ దేశ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీంతో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ నివార్క్‌-ముంబయి విమానాలను రద్దు చేసింది.ప్రయాణికుల భద్రత దృష్ట్యా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఇరాన్‌ గగనతలం మీదుగా భారత్‌కు వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. ముంబయి నుంచి న్యూజెర్సీలోని నివార్క్‌ ఎయిర్‌పోర్టుకు రావాలనుకునే ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాలను ఎంచుకోవాలని కోరింది. అయితే ఈ రద్దు ఎంతవరకు కొనసాగనున్నది మాత్రం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించలేదు. మరోవైపు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ కూడా ఇరాన్‌ గగనతలం మీదుగా నడిపే విమానాలను రద్దు చేశాయి. జపాన్‌కు చెందిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌, ఏఎన్‌ఏ హోల్డింగ్స్‌ కూడా ఇరాన్‌ మీదుగా విమానాలను నడపబోమని తెలిపాయి. తమ గగనతలంలోకి ప్రవేశించిందంటూ అమెరికాకు చెందిన డ్రోన్‌ని ఇరాన్‌ గురువారం కూల్చివేసింది. కూలిపోయిన డ్రోన్‌ను ఆర్‌క్యూ-4 గ్లోబల్‌ హాక్‌గా గుర్తించినట్లు ఇరాక్‌ రివల్యూషనరీ గార్డ్‌ని ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది. డ్రోన్‌ కూల్చివేతను అమెరికా ధ్రువీకరించింది. అయితే డ్రోన్‌ ఎలాంటి గగనతల ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లయింది.