హింస, పీడన తదితర కారణాలతో గతేడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లా 8 లక్షల మంది తమ ఇళ్లు, వాకిళ్లు వదిలిపోయారు. ఐక్యరాజ్యసమితికి సమర్పించిన వార్షిక నివేదికలో ఐరాస శరణార్థుల సంస్థ(యూఎన్‌హెచ్‌సీఆర్) ఈ వివరాలు వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరం(2017) చివరినాటికి వీరి సంఖ్య 6 కోట్లా 85 లక్షలు మాత్రమే. ఇథియోఫియాలో తెగల మధ్య ఘర్షణలు, వెనెజువెలాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఆహారం, మందుల కొరతతో నిత్యం వేలాదిమంది వలసపోతుండటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ఐరాస లెక్కల ప్రకారం 2016 నుంచి ఇప్పటి వరకు ఒక్క వెనెజువెలా దేశం నుంచే 33 లక్షల మంది వలసపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇళ్లు వదిలిపోతున్నవారి సంఖ్య గత 20 ఏళ్లలో రెట్టింపు అయ్యి, థాయ్‌ల్యాండ్ జనాభా(సుమారు 7కోట్లు)ను దాటేసింది. వీరిలో 4.13 కోట్ల మంది తమతమ దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవిస్తున్నారు. 2.59 కోట్ల మంది ఇతర దేశాల్లోని శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరో 35 లక్షల మంది ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. 2011 నుంచి యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సిరియాలో ఎక్కువమంది స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి జీవిస్తున్నారు. అలాగే, కొలంబియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసకు ఎక్కువమంది వలస పోతున్నారు. పాలస్థీనాకు చెందిన 55 లక్షల మంది వివిధ దేశాల్లో ప్రత్యేకించి లెబనాన్, జోర్డాన్‌లలో శరణార్థులుగా జీవిస్తున్నారు. దేశంలో సుస్థిర పరిస్థితులు నెలకొన్నాక ఇళ్లకు తిరిగి వెళ్లడమే శరణార్థుల సమస్యకు అత్యుత్తమ పరిష్కారమని యూఎన్‌హె చ్‌ఆర్‌సీ అధ్యక్షుడు ఫిలిప్పో గ్రండీ చెప్పారు.అయితే, వీరిలో 20 శాతం మంది రెండు దశాబ్దాలకుపైగా శిబిరాల్లోనే కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ‘శాంతి స్థాపనలో మనం దాదాపు విఫలమయ్యాం. ఇది వాస్తవం. కొత్తకొత్త ఘర్షణలు, సమస్యలు శరణార్థులను ఉత్పత్తి చేస్తున్నాయి. అదే సమయంలో పాత శరణార్థుల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం’ అన్నారు. భారీ వలసలు తీవ్ర సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు. సంపన్న దేశాల ద్వారా దీన్ని అధిగమించవచ్చని, ఇందులో జర్మనీ కృషి ప్రశంసనీయమన్నారు. ఈ విషయంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించినప్పటికీ, ఆమె మరింత సాహసోపేతంగా ఉంటారని ఆమె చర్యలు నిరూపించాయని కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా 7కోట్లకు పైగా శరణార్థులు
Related tags :