Business

అమరావతి-విశాఖ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడ?

Amaravathi-Vizag Uday Double AC Train Is Delayed Without Causes

రైల్వే సదుపాయాల విషయంలో తూర్పు కోస్తా రైల్వే తీరుకు ఇది మరో నిదర్శనం. అమరావతి-విశాఖల నడుమ తాకిడి గణనీయంగా పెరిగిన దృష్ట్యా అధునాతనమైన ‘ఉత్కృష్ట్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ యాత్రీ’ (ఉదయ్‌) ఎక్స్‌ ప్రెస్‌ రైలును ఈ మార్గంలో ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి హోదాలో సురేశ్‌ ప్రభు 2016-17 బడ్జెట్‌లోనే ప్రకటించినా ఇప్పటికీ ఇది పట్టాలపైకి రాలేదు. రైలు తయారైపోయినా తీసుకురావడంలో ఎనలేని అలసత్వం కనిపిస్తోంది. చివరకు ఇది అతీగతీ లేకుండా పంజాబ్‌లోని జలంధర్‌లో పడి ఉంది. బడ్జెట్‌ ప్రకటనకు అనుగుణంగా ఆ రైలు (రేక్‌) తయారీ బాధ్యతను 2018లో పంజాబ్‌లోని కపుర్తల రైలు పెట్టెల తయారీ కర్మాగారానికి అప్పగించారు. విశాఖ-విజయవాడ రైలుకు 22701, విజయవాడ-విశాఖ రైలుకు 22702 నంబర్లను కేటాయించారు. ఈ ఏడాది మార్చి 19న కపుర్తల కర్మాగారం నుంచి ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రేక్‌లను తూ.కో.రైల్వేకు అప్పగిస్తూ అధికారులు దస్త్రాలు సిద్ధం చేశారు. ఆ ప్రకారం రైలును స్వాధీనం చేసుకుని వెంటనే సర్వీసును ప్రారంభించాలి. కానీ ఆ రైలు గురించే పట్టించుకోలేదు. గత్యంతరం లేక రైలును కపుర్తలకు 35 కిలోమీటర్ల దూరంలోని జలంధర్‌ రైల్వేస్టేషన్‌ వెలుపల ఉంచారు. అలాగే వదిలేస్తే దీని విడిభాగాలు చోరీకి గురయ్యే అవకాశాలున్నాయని జలంధర్‌, కపుర్తలలోని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.