ScienceAndTech

బిట్‌కాయిన్ సరికొత్త రికార్డు

Bitcoin crosses 10000 USD mark

ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ చాలా రోజుల తర్వాత 10వేల డాలర్ల మార్కును దాటింది. 2018 తర్వాత ఈ మార్కును దాటడం ఇదే ప్రథమం. శనివారం ఉదయం 8.94శాతం పెరిగి 10,591.12 డాలర్లకు చేరినట్లు క్రిప్టో కరెన్సీ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ కాయిన్‌మార్కెట్‌కాప్‌ వెల్లడించింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ లిబ్రా పేరుతో క్రిప్టోకరెన్సీని తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బిట్‌కాయిన్‌ ధర కూడా పుంజుకుంది.
బిట్‌కాయిన్‌ను తొలిసారి 2008లో తయారు చేశారు. 2011 నాటికి ఒక డాలర్‌కు ఒక బిట్‌కాయిన్‌ లభించేది. ఆ తర్వాత దీని విలువ రేసుగుర్రాన్ని తలపిస్తూ పరుగులు తీసింది. 2017నాటికి ఒక బిట్‌కాయిన్‌ 20వేల డాలర్లకు సమానమైంది. కానీ, ఆ తర్వాత చాలా దేశాలు క్రిప్టోకరెన్సీలపై ఆంక్షలు విధించడంతో దీని విలువ క్రమంగా పతనమైంది. 2018 డిసెంబర్‌లో అత్యల్పంగా 3,250 వద్ద ట్రేడైంది. దీంతో ఈ కరెన్సీ ఇక ఎప్పటికీ పుంజుకోదని చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. కానీ , వారి అంచనాలను తలకిందులు చేస్తూ బిట్‌కాయిన్‌ ర్యాలీ మొదలుపెట్టింది. మూడు వారాల క్రితమే 8,700 డాలర్ల మార్కును దాటేసింది. ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ల అపహరణ గణనీయంగా పెరిగిపోయింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజీల అంచనాల ప్రకారం దాదాపు 40 మిలియన్‌ డాలర్ల విలువైన బిట్‌కాయిన్లు హ్యాకర్ల బారిన పడ్డాయి. అయినా కానీ వీటి ధర ఈ ఏడాది దాదాపు 200శాతానికి పైగా పెరిగి 10వేల డాలర్లను దాటేసింది.
కారణాలు ఇవే..
* అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బిట్‌కాయిన్‌ను సురక్షితమైందిగా ఎంచుకోవడం.
* ప్రముఖ బ్రోకరేజీ సంస్థ అయిన ఫిడెలిటీతోపాటు ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీల కొనుగోళ్లు విక్రయాలకు అనుమతించడం.
* మరోపక్క ఫేస్‌బుక్‌ కూడా క్రిప్టోకరెన్సీ తీసుకొస్తున్నట్లు ప్రకటించడం. దీనికోసం చెల్లింపు సేవల సంస్థలను, ఈ కామర్స్‌ సంస్థలను, క్రిప్టోకరెన్సీ సంస్థలను భాగస్వాములుగా చేసుకొంది. ఈ అంశాలన్నీ బిట్‌కాయిన్‌కు కలిసివచ్చాయి.

బిట్‌కాయన్ల లావాదేవీలు భారత్‌లో చట్టబద్ధం కాదు. ఆర్‌బీఐ పరిధిలో పనిచేసే ఏ సంస్థ కూడా వీటితో లావాదేవీలను నిర్వహిచదు. క్రిప్టోకరెన్సీలను నియంత్రిస్తూ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొని రావాలని ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.