Agriculture

రైతుభరోసా పథకంపై తొలిసంతకం

Minister Kannababu Signs On RythuBharosa Scheme File

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కన్నబాబు శనివారం సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. రైతు భరోసా పథకం అమలు దస్త్రంపై తొలి సంతకం చేశారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు నేతలు మంత్రికి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి సాయం అందించి అండగా నిలవాలని మేనిఫెస్టోలో చెప్పిన మాట నిజం చేస్తామన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సహకార సొసైటీల అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కౌలు రైతులకు కూడా బీమా, రుణాలు, ఇతర రాయితీలు కల్పిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి.. తక్షణమే అరికట్టి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు.